కలం, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట (Dammapeta) మండల కేంద్రంలో సుందరీకరణ పేరుతో సాగుతున్న ఆక్రమణల తొలగింపు వ్యవహారం ఇప్పుడు స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. డ్రైనేజీల పూడికతీత పనుల కోసం స్థానిక దుకాణదారులను ఖాళీ చేయిస్తున్న ప్రభుత్వం… రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తామన్న ఫుట్పాత్ లు ఎప్పుడు నిర్మిస్తుందని వ్యాపారులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గ్రామసభ సాక్షిగా స్థానిక ఎమ్మెల్యే ఫుట్ పాత్ నిర్మిస్తామని ఇచ్చిన హామీ కేవలం మాటలకే పరిమితమైందా అనే అనుమానాలు వ్యక్తమవుతుండగా, ముందస్తు భవిష్యత్తు ప్రణాళిక లేకుండా పేద ప్రజల పొట్టగొట్టడం ఎంతవరకు సమంజసమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫుట్ పాత్ మంజూరై… పనులు ప్రారంభించిన తర్వాతనే ఈ తొలగింపు చర్యలు చేపట్టాలనే డిమాండ్ దమ్మపేటలో వినిపిస్తుంది. నూతన పంచాయతీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన వెంటనే, ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఇరుపార్టీలకు చెందిన 14 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6న జరిగిన గ్రామసభలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు గ్రామస్థులు ఒక విన్నపం చేశారు. పొరుగున ఉన్న అశ్వారావుపేట తరహాలోనే దమ్మపేటను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ నిర్మించాలని కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే.. గ్రామ సభ తీర్మానం చేస్తే “రేపు ఉదయమే ఫుట్ పాత్ మంజూరు చేస్తానని”, ఇప్పటికే అశ్వారావుపేటలో టైల్స్ ప్యాకింగ్ కూడా అవుతున్నాయని, ఇక మీ నిర్ణయమే తరువాయంటూ బహిరంగంగానే హామీ ఇచ్చి గ్రామస్తుల చేత చప్పట్లు కొట్టించుకున్నారు.
ఎమ్మెల్యే ఇచ్చిన ఈ భరోసాతో పంచాయతీ కార్యదర్శి అనంత్ కుమార్ రంగంలోకి దిగి, డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణలను తొలగించాల్సిందిగా దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు. దీని ప్రకారం మంగళవారం ఉదయం నుంచే బుల్డోజర్లతో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే, ఈ నెల 6న గ్రామసభలో “రేపటికల్లా ఫుట్ పాత్ మంజూరు చేస్తా” అన్న ఎమ్మెల్యే మాటలు ఏమయ్యాయని, ఆ నిధులు ఎక్కడంటూ వ్యాపార వర్గాలు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. దుకాణాలను తొలగించిన చోట డ్రైనేజీలను అలాగే ఓపెన్‌గా వదిలేస్తారా, పూడికతీత తర్వాత జరిగేది ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ యథావిధిగా దుకాణాల ఎదుట ఎవరికి వారు సిమెంట్ బిళ్ళలు ఏర్పాటు చేసుకోవాల్సిందేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
డ్రైనేజీలను ఆక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తామంటున్న అధికారులను, వాటిపై మూతలు (స్లాబ్‌లు) వేసే బాధ్యత ఎవరిదని స్థానికులు అడుగుతున్నారు. ఓపెన్ డ్రైనేజీల వల్ల వెలువడే దుర్వాసన, దోమల బారి నుండి స్థానిక ప్రజల ఆరోగ్యానికి రక్షణ ఎవరు కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధిని తాము వ్యతిరేకించడం లేదని, కానీ ఒక ప్రణాళికాబద్ధంగా కాకుండా ఇలా అర్ధాంతరంగా పేద ప్రజల ఉపాధిని దెబ్బకొట్టడం తగదని స్థానికులు వాదిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గ్రామసభ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ప్రధాన రహదారికి ఇరువైపులా ఫుట్ పాత్ నిధులను తక్షణమే మంజూరు చేయించి, ఆ తర్వాతే డ్రైనేజీలపై ఉన్న నిర్మాణాల తొలగింపు చర్యలు చేపట్టాలని దమ్మపేట ప్రజలు, వ్యాపార వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
డ్రైనేజీ కాలువల మీద సిమెంట్ బిళ్ళలు పెట్టీ, వాటిపైన షాపులు ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు డ్రైనేజీలు పూడిక తీస్తాం, ఖాళీ చేయండని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. పూడిక తీయాలంటే మేము వేసుకున్న బిళ్ళలు తీసెయ్యాలి.అలా చేస్తే మా ఉపాధి దెబ్బతినడంతో పాటు దుర్గంధం, దోమల బెడద కూడా పెరుగుతుంది. కాబట్టి ఫుట్ పాత్ కోసం, నిధులు విడుదల అయిన తర్వాత డ్రైనేజీ పూడిక తీస్తే…వెంటనే డ్రైనేజీ కాలువపై ఫుట్ పాత్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఆలోచించి, నిధులు మంజూరు అయిన తర్వాత మా షాపులను తొలగించాలి. -ముత్త.పుల్లారావు, హోటల్ వ్యాపారి
పంచాయతీ కార్యదర్శి అత్యుత్సాహం వలన చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. అకస్మాత్తుగా దుకాణాలను తొలగించడం వల్ల సుమారు 100 కుటుంబాలు రోడ్డున పడతాయి. అందరూ చిరు వ్యాపారులే, కాబట్టి ప్రభుత్వం రేపు షాపులను తొలగించే విషయంలో ఒకసారి పునరాలోచన చేయాలి. -తంబళ్ల. రవి, దమ్మ పేట స్థానికుడు

