కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రైతాంగాన్ని రేవంత్ సర్కార్ రైతు బంధు, రైతు బీమా పేరుతో మోసం చేసిందని బీఆర్ ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. సోమవారం నిర్వహించిన అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఎప్పుడైనా ఆగిందా అని ప్రశ్నంచారు. ఈ రెండున్నరేండ్లలో ఒక్కరికైనా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సాయం అందించారా? అని అడిగారు. ఎస్టీలకు బడ్జెట్ లో రూ.2730 కోట్లు పెట్టామని చెబుతున్నారు.. కానీ ఎస్టీలకు వచ్చింది మాత్రం సున్నా అంటూ విమర్శించారు.
ఈ ప్రభుత్వం గొల్లకురుమలు, గౌడన్నలు, మత్సకారులకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ప్రజలకు చేరవేస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తోందని కొనియాడారు. తమ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన ఏ ఒక్కరిని విడిచిపెట్టమని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టిన వారు రిటైర్డ్ అయినా, ఎక్కడ దాక్కున్నా పట్టుకొస్తామని.. క్రిమినల్ యాక్షన్ తీసుకుని తగిన శిక్ష విధిస్తామని చెప్పారు.

