కలం, ఖమ్మం బ్యూరో: పారిశ్రామికంగా, సహజ వనరుల పరంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, మణుగూరు ప్రాంతంలో ప్రధాన రహదారి ఇప్పుడు సామాన్య ప్రజల పాలిట నరకద్వారంగా మారింది. మణుగూరు-వరంగల్ ప్రధాన రహదారి (Manuguru-Warangal Highway) పై అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోయిన ఇసుక, బొగ్గు లారీల రాకపోకల వల్ల నిత్యం తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా సాంబయ్యగూడెం నుంచి రామాంజరం వరకు కిలోమీటర్ల మేర వందలాది భారీ వాహనాలు నిలిచిపోతుండటంతో, ఈ మార్గంలో ప్రయాణించే సాధారణ ప్రజలు, వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే నరకయాతన అనుభవిస్తున్నారు. భారీ లారీలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ రోడ్డంతా ఆక్రమించుకోవడంతో, ద్విచక్ర వాహనదారులు ఎప్పుడు ఏ చక్రాల కింద నలిగిపోతామోననే భయాందోళనల మధ్య, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.
ఈ ట్రాఫిక్ విపత్తు కేవలం ప్రయాణ ఆలస్యానికే పరిమితం కాకుండా, మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ సేవలకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ వల్ల తీవ్ర అంతరాయం కలుగుతోంది. తాజాగా పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొమరం వంశి అనే వ్యక్తిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అంబులెన్స్‌కు సైతం దారి ఇవ్వలేని విధంగా లారీలు రోడ్డును దిగ్బంధించాయి. దీంతో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి రోగిని తరలించడం తీవ్ర ఇబ్బందిగా మారింది. నిత్యం సంభవిస్తున్న ఇటువంటి సంఘటనలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఈ ఘోరమైన పరిస్థితికి మైనింగ్, ఇసుక క్వారీల నుంచి సామర్థ్యానికి మించి ఒకేసారి వాహనాలు రోడ్డుపైకి రావడం, భారీ వాహనాల రాకపోకలపై ఎలాంటి సమయ నియంత్రణ లేకపోవడమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. రవాణా, పోలీస్, మైనింగ్ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ సమస్య జటిలమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, కార్యాలయాల వేళల్లో భారీ వాహనాలపై నిషేధం విధించాలని, నిబంధనలు ఉల్లంఘించే లారీ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర ప్రణాళికతో ఈ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని మణుగూరు ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

