Mobile Popup Ad
Mobile Popup Ad

రక్తదానం చేస్తే శాశ్వత బలహీనత వస్తుందా? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

కలం, వెబ్‌డెస్క్: రక్తదానం (Blood Donation) అనేది ఒకరి ప్రాణాన్ని కాపాడే అత్యంత మహోన్నతమైన దానం. ప్రమాదాలు జరిగినప్పుడు, సంక్లిష్టమైన శస్త్రచికిత్సల సమయంలో, రక్తహీనత, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడే వారికి రక్తం ఎంతో అవసరం అవుతుంది. ఈ క్రమంలోనే రక్తదాతల నుండి సేకరించిన రక్తాన్ని సురక్షితంగా దాచడానికి, అవసరమైన రోగులకు సకాలంలో అందించడానికి బ్లడ్ బ్యాంకులు కూడా ఉంటాయి. అయితే కొంతమందికి ఒక సందేహం ఉంటుంది. రక్తదానం చేయడం వల్ల శాశ్వత శారీరక బలహీనత కలుగుతుందా? అని. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

నిపుణుల ప్రకారం.. రక్తదానం చేయడం వలన ఎటువంటి శాశ్వత బలహీనత కలగదు. రక్తదానం చేసిన తర్వాత కాస్త అలసట, తల తిరగినట్లు అనిపిస్తుందట. కానీ ఇది కేవలం తాత్కాలికమైనదేనని, ఈ పరిస్థితిని త్వరగా సరిదిద్దవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే రక్తదానం చేయడం వలన మన శరీరం వేటిని కోల్పోతుంది అనే విషయాన్ని నిపుణులు వివరించారు. రక్తదానం చేయడం వలన శరీరరం 3 ప్రధాన విషయాలను కోల్పోతుందట. అవి 1. ద్రవాలు, 2. ఎర్ర రక్త కణాలు, 3. ఇనుము. వీటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. రక్తదానం చేసినప్పుడు శరీరం కోల్పోయే ఈ 3 ప్రధాన అంశాలను తిరిగి పునరుద్ధరించుకోవడానికి మానవ శరీరం ఒక అద్భుతమైన వ్యవస్థలా పనిచేస్తుంది.

1. ద్రవాలు.. రక్తదానం చేసిన తర్వాత శరీరం కోల్పోయిన ద్రవ పరిమాణాన్ని తగినంత నీరు, పండ్ల రసాలు తాగడం ద్వారా 24 నుండి 48 గంటలలోపు తిరిగి పునరుద్దరించుకోవచ్చు. అందుకే రక్తదానం చేసేముందు, చేసిన తర్వాత నీరు పుష్కలంగా త్రాగమని వైద్య నిపుణులు సలహా ఇస్తారు. మనం తాగే నీరు రక్తం పునరుత్పత్తికి దోహదపడుతుందని చెబుతున్నారు.

2. రెండవది ఎర్ర రక్త కణాలు.. మన శరీరం కోల్పోయిన ఎర్ర రక్త కణాలను పూర్తిగా పునరుత్పత్తి చేయడానికి 4 నుండి 6 వారాల సమయం పడుతుందట.

3. ఇనుము.. రక్తదానం చేసినప్పుడు శరీరం కోల్పోయిన ఐరన్‌ను మన శరీరం తిరిగి పొందడానికి సుమారు 12 వారాలు (3 నెలలు) సమయం పడుతుందని చెబుతున్నారు.

ఈ కారణంగానే బ్లడ్ బ్యాంకులు, డాక్టర్లు ఒకసారి రక్తదానం చేసిన తర్వాత మళ్ళీ చేయడానికి కనీసం 3 నుండి 4 నెలల విరామం ఉండాలని చెబుతారు. సాధారణంగా ఏడాదిలో 2 లేదా 3 సార్లు రక్తదానం చేయొచ్చని సూచిస్తున్నారు.

రక్తదానం చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆరోగ్యంగా ఉన్న, అర్హులైన వ్యక్తులు రక్తదానం చేసిన వెంటనే తమ రోజువారీ పనులకు తిరిగి వెళ్ళవచ్చట. కానీ రక్తదానం చేసిన వెంటనే తీవ్రమైన వ్యాయామం, బరువైన వస్తువులను ఎత్తడం చేయకూడదట. శ్రమతో కూడిన క్రీడలకు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే రక్తదానం చేసిన తర్వాత శరీరం కోల్పోయిన శక్తిని, ద్రవాలను తిరిగి పొందే ప్రక్రియలో ఉన్నప్పుడు, దానికి సరైన పోషకాలు, విశ్రాంతి అందించడం చాలా అవసరం.

సరైన ఆహారం, తగినంత నీరు, తగినంత విశ్రాంతి తీసుకుంటే రక్తదానం వల్ల శరీరానికి ఎటువంటి హాని జరగదని సూచిస్తున్నారు నిపుణులు. మీరు ఇచ్చిన రక్తం స్థానంలో కొత్త రక్తం వెంటనే పునరుత్పత్తి అవుతుందట. అయితే మంచి పండ్ల రసాలు తాగడం, శీతల పానీయాకలు దూరంగా ఉండటం వలన రక్తం త్వరగా పునరుత్పత్తి అవుతుందట. ఒక్కరు చేసే రక్తదానం ఒకరి కంటే ఎక్కువ మంది ప్రాణాలను కాపాడుతుంది కాబట్టే దానిని “మహోన్నతమైన ప్రాణదానం” అంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>