కలం, నల్లగొండ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు, ప్రస్తుత పరిపాలన వ్యవస్థపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఎన్నికల్లో విచ్చలవిడి ధనప్రవాహం, బ్యూరోక్రసీలో పెరిగిపోతున్న అవినీతి, రాజకీయాల్లో మారిన విలువలపై ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత రాజకీయాల్లో ఓ అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు. గతంలో పార్టీ జెండాలు మోసి, ప్రజల్లో తిరిగిన సాధారణ కార్యకర్తలే ప్రజాప్రతినిధులుగా ఎదిగేవారని ఆయన గుర్తు చేశారు. కానీ.. ప్రస్తుత రోజుల్లో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, విపరీతమైన ధనబలం ఉన్నవారే రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని విమర్శించారు.
అయితే, రాజకీయ నాయకుల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్రంలో అధికారుల అవినీతి ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని మండలి చైర్మన్ (Council Chairman) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లు, లాకర్లలో కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం బయటపడటం సమాజానికి మంచిది కాదన్నారు. “చిన్న స్థాయి ఉద్యోగులకు కూడా కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఎలా వస్తున్నాయి?” అని ఆయన ప్రశ్నించారు.
అధికారులపై ప్రభుత్వానికి పూర్తిస్థాయి అజమాయిషీ ఉండాల్సిన అవసరం ఉందని, అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పట్టుబడిన అధికారులకు కోర్టులు కఠిన శిక్షలు త్వరగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వాలు మళ్లీ కీలక పోస్టింగులు ఇచ్చే సాంప్రదాయానికి స్వస్తి పలకాలని సూచించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న రైతు భరోసా పథకంపై గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) కీలక సూచన చేశారు. పెట్టుబడి సహాయం అందించే విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. కొండలు, గుట్టలు, సాగుకు పనికిరాని రియల్ ఎస్టేట్ వెంచర్ల భూములకు కాకుండా.. కేవలం సేద్యయోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు అందేలా నిబంధనలు రూపొందించాలని గుత్తా ప్రభుత్వాన్ని కోరారు.
Read Also: భారత్‌ను చూసి అమెరికా నేర్చుకోవాలి.. ఫారిన్ యువతి ప్రశంసలు
Follow Us On : WhatsApp

