కలం, వెబ్‌డెస్క్: ఈ కాలపు యువత చర్మ సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందంగా కనిపించేందుకు రకరకాల క్రీములు వాడుతుంటారు. మాయిశ్చరైజర్లు.. లోషన్లు అప్లై చేస్తుంటారు. కానీ చర్మాన్ని మెరిపించేందుకు (Skin Care) క్రీములు, లోషన్లు, మాయిశ్చురైజర్లతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. మనం తెలియక చేసే కొన్ని పొరపాట్లు మన చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. మెరుస్తూ ఉండాల్సిన చర్మం కళ లేకుండా పోతోంది. అసలు చర్మం అందాన్ని కోల్పోయే ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తరచుగా ముఖం కడగడం
సాధారణంగా చర్మం ద్వారా ఉత్పత్తి అయ్యే సహజ నూనెలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మనం తరచుగా ముఖం కడుక్కోవడం వలన సహజంగా ఉత్పత్తి అయ్యే ఈ నూనెలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
మేకప్ ఉత్పత్తులు
చాలా మేకప్ ఉత్పత్తులు ముఖ్యంగా ఫౌండేషన్స్, చర్మానికి సరిపోకపోతే రంధ్రాలను మూసివేయడం (క్లాగింగ్) ద్వారా మొటిమలకు లేదా చికాకుకు దారితీస్తాయి. అంతేకాకుండా మన కళ్లు ఆకర్షవంతంగా కనిపించేందుకు రంగరంగుల ఐషాడోలు, కాజల్ ఉపయోగిస్తుంటాం. దీనివల్ల కళ్ల చుట్టూ చిరాకు ఏర్పడుతుందట. అది చర్మ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని చెబుతున్నారు.
తరచుగా ముఖాన్ని తాకడం
సాధారణంగా మనకు తెలియకుండానే మన ముఖాన్ని చాలా సార్లు తాకుతుంటాం. అయితే మన చేతుల్లో ఉండే క్రిములు మన చర్మానికి హాని చేసి దద్దుర్లు, దురదలను కలిగిస్తాయట. అందుకే చర్మాన్ని తాకేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని చెబుతున్నారు నిపుణులు.
సరిపడా నీరు తాగకపోవడం
మన బిజీ లైఫ్ కారణంగా శరీరానికి సరిపడా నీరు మనం తాగలేకపోవడం కూడా చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట. నీరు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నీరు సరిగ్గా తాగినపుడు చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. నీరు తాగకపోతే శరీరం డీహైడ్రేట్ అయ్యి చర్మం పొడిబారినట్లు కనిపిస్తుందని చెబుతున్నారు.
మనం తినే ఆహారం
ఈ కాలపు యువత ఫాస్ట్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ను చాలా ఇష్టంగా తింటారు. వీటిలో మొటిమలు, రోసేసియా, అలర్జీలు కలిగించే పదార్థాలు ఉంటాయి. అందుకే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
సరైన నిద్ర లేకపోవడం
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు నిద్ర చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, ముడతలు పడకుండా ఉంచే కొల్లాజెన్ ప్రొటీన్ల ఉత్పత్తి మందగిస్తుందట. అందుకే ప్రతిరోజూ తగినంత నిద్రపోయేలా చూసుకోవడం అవసరం.
పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే తాజా పండ్లు, కూరగాయాలు తీసుకోవడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు.

