కలం, వెబ్ డెస్క్: ఫుట్‌బాల్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) 2026 మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. కేవలం 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదై, గత 68 ఏళ్లలోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న వరల్డ్‌కప్‌గా నిలిచింది. జూన్ 12న దక్షిణాఫ్రికాపై మెక్సికో 2-0 విజయంతో టోర్నీ గోల్స్ ఖాతా తెరుచుకోగా, స్వీడన్‌పై నెదర్లాండ్స్ 5-1 తేడాతో గెలిచిన మ్యాచ్‌లో కోడి గాక్‌పో చేసిన గోల్ టోర్నీలో 100వ గోల్‌గా నమోదైంది. దీంతో 1982, 2014 ప్రపంచకప్‌లలో ఉన్న 36 మ్యాచ్‌ల రికార్డు చెరిగిపోయింది.
అయితే 1954 స్విట్జర్లాండ్ వరల్డ్‌కప్‌లో కేవలం 20 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదైన ఆల్‌టైమ్ రికార్డు మాత్రం ఇంకా చెక్కుచెదరలేదు. అదే సమయంలో నెదర్లాండ్స్ జట్టు కూడా చరిత్ర సృష్టించింది. ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో 100 గోల్స్ మార్క్‌ను అందుకున్న ఎనిమిదో దేశంగా నిలిచింది. స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాబీ చేసిన రెండో గోల్ నెదర్లాండ్స్‌కు వరల్డ్‌కప్‌లలో 100వ గోల్‌గా గుర్తింపు పొందింది.
ఇక జపాన్-ట్యునీషియా మధ్య మాంటెర్రే స్టేడియంలో జరిగిన గ్రూప్-ఎఫ్ పోరు ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో 1000వ మ్యాచ్‌గా నిలిచింది. మొత్తం 48 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో గోల్స్ వర్షం కురుస్తుండటంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.

