Mobile Popup Ad
Mobile Popup Ad

ఇందూరు పొలాల్లో ఉత్తరాది కూలీలు!

కలం, నిజామాబాద్ బ్యూరో: ఉత్తరాది రాష్ట్రాల వ్యవసాయ కూలీలు (North Indian Paddy Workers) ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో నాట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో వర్షాలు కురిసిన కొన్ని చోట్ల, బోర్లు కింద రైతులు సాగు పనులు నిర్వహిస్తున్నారు. యూపీ, బిహార్ నుంచి మగ కూలీలను పిలిపించి నాట్లు వేయిస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద కూడా ముందస్తు నాట్లను రైతులు మొదలుపెట్టారు. ఉత్తరాది రాష్ట్రాల మగ కూలీలు వచ్చి నాట్లు వేయిస్తుండగా, భారీ సంఖ్యలో ఇక్కడి వచ్చారు. కూలీలు గ్రూపులుగా విడిపోయి నాట్లు వేస్తున్నారు. 18 మంది కలిసి రోజుకు 7 ఎకరాల్లో నాటు వేయడం పూర్తి చేస్తున్నారు. ఎకరానికి రూ.4,500 చొప్పున తీసుకుంటున్నారు. సమయం, డబ్బులు ఆదా కావడంతో పాటు ఉత్తరాది కూలీల పనిలో కచ్చితత్వం ఉంటుందని జిల్లా రైతులు మేస్త్రీల ద్వారా ప్రత్యేకంగా సంప్రదించి ఇక్కడికి రప్పిస్తున్నారు. బాన్సువాడ, బిచ్కుంద, వర్ని, చందూర్ ప్రాంతాలకు వచ్చిన సుమారు 450 మంది కూలీలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జోరుగా నాటు పనులు కొనసాగిస్తున్నారు.

రెండు వైపులా తాడు కట్టి..

నారును వరుస క్రమంలో నాటడంతో ఉత్తరాది కూలీల ప్రత్యేకత. ఒక మడిని ఆరు భాగాలుగా పంచుకుంటారు. రెండు వైపులా తాడు కట్టి ఇద్దరు చొప్పున ఒక బ్లాక్ లో నాట్లు వేస్తూ వెళ్తారు. ఎవరి భాగం వాళ్లు వేగంగా పని పూర్తి చేస్తారు. పొద్దున 5, 6 గంటలకే పొలం గట్లపై రెడీగా ఉంటారు. సాయంత్రం 6 గంటలకు బయటకు వచ్చేస్తారు. వేగంతో పాటు నారుకు నారుకు మధ్య చాలా గ్యాప్ ఇస్తారు. తక్కువ మొక్కలు నాటుతారు. తద్వారా పంటలకు గాలి వెలుతురు బాగా ఆడి దిగుబడి బాగుటుందని రైతులు అంటున్నారు. స్థానిక కూలీలకంటే ఉత్తరాది కూలీలతో పనులు చేయించడం ద్వారా ఖర్చులు భారీగా మిగలడంతో పాటు త్వరగా నాటు వేయడం పూర్తి చేస్తారని రైతు గంగారం తెలిపారు.

రెండు నెలలు మకాం

ఉత్తరాది మగ కూలీలు కొన్నేళ్లుగా నిజామాబాద్ జిల్లాకు వస్తున్నారు. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ వస్తున్నారు. ఒక స్థానిక మేస్త్రీ వారికి వసతి ఏర్పాటు చేస్తారు. వంటలు కూడా మగ వారే చేస్తారు. టిఫిన్ లు తీసుకొని పొలాలకు వెళ్తారు. రెండు నెలలు ఇక్కడే ఉండి నాట్లు పూర్తయ్యాక సంపాదించిన డబ్బులతో తిరిగి వెళ్లిపోతారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>