Indian Army Chief | భారత్, పాక్ మధ్య వాతావరణం కొంతకాలంగా హాట్‌హాట్‌గా ఉంది. రెండు దేశాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్(Operation Sindhur)’ దెబ్బకు పాక్ కాళ్లబేరానికి వచ్చింది. శాంతి కావాలంటూ ఫోన్లపైనే ఫోన్లు చేసి.. కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసింది. అయితే ఇప్పుడు భారత్‌కు కోపం తగ్గిపోయి ఉంటుందనుకుందో ఏమో పాక్.. మళ్లీ తోక జాడిస్తోంది. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. భారత్ చేతిలో ఇప్పటికే ఒకసారి చావుదెబ్బ తిన్నది, ఇంకా దాని నుంచి కోలుకోను కూడా కోలుకోలేదు కానీ ప్రగల్బాలు మాత్రం తారాస్థాయిలో ఉంటున్నాయి.
తాజాగా ఖవాజా మాట్లాడుతూ.. మరోసారి భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు. కానీ ఈసారి యుద్ధం వస్తే మాత్రం తాము అనుకూల ఫలితాలు సాధిస్తామన్నారు. ‘‘నేను ఉద్రిక్తతలను కోరుకోవట్లేదు. కోరుకోను. కానీ ముప్పు పొంచి ఉన్నమాట వాస్తవం. భారత్‌తో యుద్ధం అవకాశాలే లేవని చెప్పలేం. ఈసారి యుద్ధం వస్తే గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తాం’’ అని వ్యాఖ్యానించారు.
అయితే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌కు ఇటీవల భారత ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది(Indian Army Chief) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఈసారి రెచ్చగొడితే ఆపరేషన్ సింధూర్ 1.0 తరహాలో భారత సహనాన్ని చూడరు. ఆపరేషన్ సింధూర్ 2.0లో సహనాన్ని ఏమాత్రం ప్రదర్శించం. ప్రపంచ పటంలో ఉండాలన్న కోరిక పాక్‌కు ఉంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలి. లేదంటే దేశాన్నే తుడిచిపెట్టాల్సి వస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. అందుకు కౌంటర్‌గానే ఖవాజా కవ్వింపు వ్యాఖ్యలు చేశారు.

