కలం డెస్క్: అంతరిక్ష కేంద్రంపై అమెరికా ప్రత్యేక దృష్టి సారించింది. చంద్రుడిపై నాసా (NASA) పర్మినెంట్ బేస్ కోసం ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. ఈ లక్ష్య సాధన కోసం నాసా చేస్తున్న అంతరిక్ష ప్రయాణంలో అమెరికా ప్రభుత్వం సహకారం అందించనుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతరిక్ష రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని నిర్ధారించడం (Ensuring American Space Superiority) పేరుతో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు. ఇందులో భూమి బయట జరిగే అంతరిక్ష కార్యకలాపాలు దేశ భద్రత, ఆర్థికాభివృద్ధి, భవిష్యత్ సాంకేతిక పురోగతికి అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
ఈ ఆదేశాల ప్రకారం, అమెరికా అంతరిక్ష విధానం.. మానవ అన్వేషణను మరింత విస్తరించడమే కాకుండా, దేశానికి అవసరమైన ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను రక్షించాలి. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో వాణిజ్య అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించి, ఒక కొత్త అంతరిక్ష యుగానికి పునాది వేయాలని పేర్కొన్నారు.
చంద్రుడిపై పర్మినెంట్ బేస్
2030నాటికి చంద్రుడిపై శాశ్వత లూనార్ ఔట్‌పోస్ట్‌కు సంబంధించిన ప్రాథమిక ఎలిమెంట్స్‌ను స్థాపించడం ప్రధాన లక్ష్యంగా ట్రంప్ పేర్కొన్నారు. తద్వారా అంతరిక్ష రంగంలో అమెరికా ఉనికి కాపాడటమే కాకుండా, అంగారక గ్రహం(Mars) వైపు మానవ అన్వేషణకు మార్గాన్ని సుగమం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ట్రంప్ తన ఆర్డర్‌లో పేర్కొన్నారు. ఈ లక్ష్యాలు ఇప్పటికే నాసా (NASA) అమలు చేస్తున్న ఆర్టెమిస్(Artimis) కార్యక్రమంతో అనుసంధానమై ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో శాస్త్రీయ స్థావరాలు ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఉంది.
అంతరిక్షంలో అణుశక్తి వినియోగం
అంతరిక్షంలో అణుశక్తిని వినియోగించుకోవడం కోసం అణు విద్యుత్ కేంద్రాలు (Nuclear Reactors) వినియోగించాలన్న అంశాన్ని కూడా ఈ ఆర్డర్ ప్రధానంగా పేర్కొంది. భూమి కక్ష్యలోను, చంద్రుడిపైన అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, 2030 నాటికి చంద్రుడికి ఒక అణు రియాక్టర్‌ను పంపే స్థాయికి చేరుకోవాలని స్పష్టం చేశారు. నాసా ఇప్పటికే ఈ దిశగా పరిశోధనలు చేస్తోంది.
Read Also: ఇలాంటి పాస్‌వర్డ్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..!
Follow Us On: Instagram


