కూటమి ప్రభుత్వం పెడుతున్న తప్పుడు, అబద్ధపు కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వైసీపీ శ్రేణులకు సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) వ్యాఖ్యానించారు. తాము ప్రశ్నిస్తే కూటమి కూసాలు కదిలిపోతాయన్న భయంతోనే వైసీపీ నేతలను తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతుల పక్షాన పోరాడి యూరియా కష్టాలు తీర్చడానికి కృషి చేశామని గుర్తు చేశారు. ప్రజల్లో తమకు పెరుగుతున్న ఆదరణ చూసి చంద్రబాబు(Chandrababu)కు కడుపుమండుతోందని, అందుకే అధికారంతో పోలీసులను పావులుగా వినియోగించుకుంటూ వైసీపీ నేతలపై తప్పుడు కేసులను పెడుతున్నారన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన జిల్లా వైసీపీ విస్తృతస్తాయి సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి.. ప్రభుత్వం, ప్రభుత్వ వైఖరిపై ఘాటు విమర్శలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడటం ఆపమని అన్నారు.
‘‘ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి. ఎవరూ కూడా కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రజల కష్టాలు ఈ సర్కార్‌కు కనిపించట్లేదు. డయేరియా బాధితులను గాలికి వదిలేసింది. ఎవరు ఎన్ని తప్పులు చేసినా మీడియాను అడ్డుపెట్టుకుని బయటపడొచ్చని అనుకుంటున్నారు. వాస్తవాలను మీడియా సహాయంతో కప్పిపుచ్చేయొచ్చని అనుకుంటున్నారు. అదే విధంగా కొన్ని సంస్థలు కూడా డబ్బులకు కక్కుర్తి పడి ప్రభుత్వం ఏం చేసినా దాన్ని కప్పిపుచ్చుతోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘పేద విద్యార్థులకు సైతం వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో మాజీ సీఎం జగన్(YS Jagan) తన హయాంలో 17 మెడికాల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడ జగన్‌కు పేరు వచ్చేస్తుందో అన్న భయంతో ఆ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోంది. విద్యా వైద్యం పేదలకు అందుబాటులో ఉంచాలని జగన్ పని చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. కల్తీ మద్యం తయారు చేసింది కూటమి ప్రభుత్వం. నిందలు వేసేది మాత్రం వైసీపీపైన.. కల్తీ మద్యం ఫ్యాక్టరీ పెట్టేశారు. గ్రామ మండల స్థాయి కమిటీలు అన్ని పూర్తి చేస్తాం. పార్టీ అధినేత జగన్ ఆదేశం ప్రకారం 29 అనుబంధ విభాగాల నియామకం జరుగుతుంది. కోటి సంతకాల సేకరణ చేస్తాం. దాని ద్వారా ప్రభుత్వం పై పోరాడతాం. ప్రభుత్వం చేసిన ఏ తప్పును వదిలిపెట్టింది. ప్రభుత్వం విస్మరించిన ఏ ప్రజా సమస్యను వదలం. అన్ని అంశాలపైనా పోరాటం చేస్తాం” అని వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) వ్యాఖ్యానించారు.
Read Also: కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

