epaper
Friday, January 16, 2026
spot_img
epaper

గ్రామీణ ఉపాధిపై మోడీ బుల్‌డోజర్లు : సోనియా

కలం డెస్క్ : దాదాపు ఇరవై ఏండ్ల నుంచి అమలులో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరును వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవిక మిషన్ -గ్రామీణ్ (VB-G RAM G) అని పేరు మార్చడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. జాతిపిత అని మహాత్మాగాంధీని (Mahathma Gandhi) కొలుస్తూనే జాతీయ పథకంలో ఆయన పేరును తొలగించి ‘రామ్’ (RAM) అనే అర్థం వచ్చేలా పేరు మార్చడం, పాలసీలో మార్పులు చేయడాన్ని తప్పుపట్టింది. దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) శనివారం దేశ ప్రజలను ఉద్దేశిస్తూ విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధాని మోడీపైనా (Modi), కేంద్ర ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రధాని మోడీ బుల్‌డోజర్లు నడుపుతున్నారని, పేదల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. ఇరవై ఏండ్ల క్రితం అన్ని రాజకీయ పార్టీల సమ్మతితో రూపుదిద్దుకున్న ఈ చట్టం గ్రామీణ నిరుపేద కుటుంబాల జీవితాల్లో ఒక విప్లవాత్మకమైన (Revolutionary) ముందడుగు అని అభివర్ణించారు.

గ్రామీణ ప్రాంతాల్లో కడు నిరుపేద, దోపిడీ పీడనలకు గురవుతున్న (Exploited) కుటుంబాలకు గ్రామీణ ఉపాధి (Rural Employment) ఒక భరోసా అని, పొట్ట చేతపట్టుకుని ఉపాధిని వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస (Migration) వెళ్ళకుండా నిరోధించగలిగిందని ఆమె పేర్కొన్నారు. ఉపాధి పొందడం ఈ చట్టం ద్వారా ఒక హక్కుగా మారిందన్నారు. గ్రామ పంచాయతీలకు (Gram Panchayat) అధికారాలు కూడా దక్కాయన్నారు. మహాత్మాగాంధీ కన్న గ్రామ్ స్వరాజ్ (Gram Swaraj) కలలు ఈ చట్టంతో సాకారమయ్యాయన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ చట్టాన్ని ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ ఒక పథకం ప్రకారమే నీరుగారుస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లోని పేదల, అణగారిన వర్గాల, నిరుద్యోగుల ప్రయోజనాలను విస్మరించారని అన్నారు. కరోనా కాలంలో (Covid-19) పేదలకు ఈ చట్టం ఒక ప్రాణధారగా నిలిచిందన్నారు. దురదృష్టవశాత్తూ మోడీ హయాంలో ఈ చట్టం అమలు మందగించిందని, నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని, ఇప్పుడు పేరుతో పాటు దాని స్వరూపాన్ని కూడా మార్చేశారని అన్నారు.

ఏకపక్షంగానే కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకున్నదాని, ఈ రంగంలో అనుభవమున్న ఏ ఒక్కరినీ (మేధావులను) కన్సల్ట్ చేయలేదని, కనీసం ప్రతిపక్ష పార్టీల విశ్వాసాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. చట్టసభల్లో చర్చకు ఆస్కారం లేకుండా మందబలంతో బిల్లును పెట్టి ఆమోదం పొందిందన్నారు. కొత్త చట్టం ద్వారా ఇకపైన ఎవరికి ఉపాధి లభిస్తుంది, ఎలాంటి ఉపాధి అందుతుంది, ఎక్కడ ఉపాధి అవకాశాలుంటాయి, ఏ విధానంతో అది సాకారమవుతుంది.. ఇలాంటివన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే ఉన్నాయని, ఢిల్లీలో కూర్చొన్న ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయం చేస్తున్నదని సోనియా(Sonia Gandhi) ఆరోపించారు.

యూపీఏ హయాంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడానికి ముందు అనేక రకాలుగా మేధోమధనం జరిగిందని, నిష్ణాతులతో చర్చలు జరిగాయని సోనియాగాంధీ గుర్తుచేశారు. దీన్ని ఒక పార్టీకి పరిమితం చేయకుండా జాతి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పేదల కడుపు నింపేలా ఆలోచించిందన్నారు. ఉపాధి పొందడ పేదలకు ఒక హక్కులా మార్చిందన్నారు. కానీ మోడీ ప్రభుత్వం కోట్లాది మంది రైతులు, రైతుకూలీలు, కార్మికులు, భూమి లేనినిరుపేదలు.. ఇలాంటివారి ప్రయోజనాలు దెబ్బతీస్తున్నదన్నారు. ఇరవై ఏండ్ల క్రితం యూపీఏ (UPA) చైర్‌పర్సన్ హోదాలో తాను పేదలకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో మానసికంగా ఎంతగానో సంఘర్షణ పడి ఈ చట్టానికి ప్రాణం పోశానని, అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ (Manmohan Singh) చేతుల మీదుగా పేదల కడుపు నిపే చట్టంగా రూపుదిద్దుకున్నదని గుర్తుచేశారు. ఇప్పుడు పేరుతో పాటు స్వరూప స్వభావాన్ని మార్చిన ప్రధాని మోడీ దీన్ని ఒక నల్ల చట్టంగా తీసుకొచ్చారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కలిసొచ్చే శక్తులను, ప్రజలను కలుపుకుని పేదలకు ఉపాధి హక్కు చేజారకుండా ఉద్యమంలో పాలు పంచుకుంటానని, వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.

Read Also: సినీ గ్లామర్‌తో తెలంగాణ బీజేపీకి లాభమెంత?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>