కలం, వరంగల్ బ్యూరో: ఐనవోలు మల్లికార్జునస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న ఐనవోలు జాతర (Ainavolu Jathara) ఏర్పాట్లపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్. నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఆలయ కమిటీ ప్రతినిధులతో కలసి సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
బస్టాండ్ ఏర్పాటు చేసే చోట భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు ఏర్పాటు చేయాలన్నారు. ఐనవోలు జాతరలో పారిశుధ్య నిర్వహణ ఎంతో ముఖ్యమని పంచాయతీ అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జాతరలో విద్యుత్ అంతరాయం లేకుండా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జాతరలో చిన్నపిల్లల కోసం అంగన్వాడీ కేంద్రాలలో అందించే బాలామృతం పౌష్టికాహారాన్ని ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహిళా సంఘాలకు స్టాల్స్ ఏర్పాటు చేయించాలని అన్నారు.
ప్రైవేటు ఆసుపత్రులు కూడా స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించే విధంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. తగినన్ని ఆర్టీసీ బస్సుల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఐనవోలు జాతర నుండి భక్తులు కొమురవెల్లి, మేడారం కు వెళ్లే అవకాశాలు ఉంటుందని, అందుకు తగినవిధంగా బస్సులను ఏర్పాటు చేయాలన్నారు.
మహిళల భద్రత నిమిత్తం మహిళా పోలీసు సిబ్బందిని పోలీస్ శాఖ కేటాయించాలన్నారు. జాతర సమీపిస్తున్న దృష్ట్యా రోడ్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. నిత్యాన్నదాన కార్యక్రమంలో భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఐనవోలు జాతర (Ainavolu Jathara)ను ప్రశాంతంగా నిర్వహించే విధంగా వివిధ శాఖలు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు.
Read Also: నాంపల్లి కోర్టుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే
Follow Us On: X(Twitter)


