వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాజయం తప్పదు: ధర్మపురి అరవింద్

కలం, భువనగిరి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. బుధ‌వారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం సురేంద్రపురిలో నిర్వహించిన బీజేపీ శిక్షణ తరగతుల్లో ధ‌ర్మపురి అర‌వింద్‌ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కనీసం చదువు రాదని, రేవంత్ రెడ్డి దేశంలోనే అత్యంత చెత్త ముఖ్య‌మంత్రి అని విమ‌ర్శించారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో ఒక ప‌నికి రాని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, రవాణాపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అరవింద్ విమ‌ర్శించారు. రాష్ట్రంలో దొంగ ఇసుక లారీలు యథేచ్ఛగా దొరుకుతాయి కానీ, రైతుల ధాన్యం రవాణా చేయడానికి మాత్రం లారీలు దొరకవా? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్‌కు దోచుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి అన్నదాతలపైన లేదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఎఫ్‌సీఐకి 32 లక్షల టన్నుల ధాన్యం బకాయి పడిందని, ఇకపై ధాన్యం కొనుగోళ్ల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే ద‌వ‌డ ప‌గ‌ల‌గొట్టాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్రిపుర, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల కంటే తెలంగాణలో బీజేపీ గెలవడం చాలా సుల‌భ‌మ‌ని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాను ఓట్లుగా మార్చుకోవడంలో తాము కొంత విఫలమయ్యామని అంగీకరించారు. బీజేపీ నాయకుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండటం సహజమేనని కొట్టిపారేశారు. ఇక కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో కేసు నమోదు కావడంపై స్పందిస్తూ.. అది రేవంత్ రెడ్డి కుట్రనా లేక కాంగ్రెస్ అంతర్గత కుట్రనా అనేది వాళ్లే తేల్చుకోవాలని అరవింద్ వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>