కలం, వరంగల్ బ్యూరో: భవన నిర్మాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని హనుమకొండ (Hanumakonda) జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. బుధవారం హనుమకొండ నగరంలోని వికాస్‌నగర్, గోపాల్‌పూర్, భీమారం, ఎర్రగట్టుగుట్ట, ఎక్సైజ్ కాలనీ ప్రాంతాల్లో నిర్మించిన పలు భవనాలను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించడంతోపాటు, నిర్మాణాల కొలతలు, సెట్‌బ్యాక్‌లు, పార్కింగ్ సౌకర్యాలు, అనుమతుల ప్రకారం చేపట్టిన నిర్మాణ పనులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ అనుమతులు, ప్రభుత్వ నిబంధనలు, సాంకేతిక ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించిన నిర్మాణాలకే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజల భద్రత, నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. భవనయజమానులు అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆమె వెంట సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, టౌన్ ప్లానింగ్ అధికారులు అవినాష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

