అతిథులతో పిల్లలు అగౌరవంగా ప్రవర్తిస్తున్నారా? ఇలా మార్చండి

కలం, వెబ్‌డెస్క్: పిల్లలను పెంచడం అనేది ఒక బాధ్యతతో కూడుకున్న పని. అయితే పిల్లలందరూ ఒకే స్వభావాన్ని కలిగి ఉండరు. కొంత మంది యాక్టివ్ గా ఉంటే, మరికొందరు బద్ధకంగా ఉంటారు. కొంత మంది పిల్లలు అందరితో ఇట్టే కలిసిపోతే, మరికొంత మంది పిల్లలు వేరేవారితో అస్సలు కలవకపోగా ఇంటికి వచ్చిన వారితో అగౌరవంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి సమస్యలను తల్లిదండ్రులు తరచూ ఎదుర్కొంటారు. ఈ సమస్యలకు తల్లిదండ్రులే చెక్ పెట్టవచ్చంటున్నారు (Parenting Tips) సైకాలజిస్టులు.

సాధారణంగా ఇంటికి వచ్చిన అతిథులు పిల్లలను పలకరిస్తుంటారు. పాప నీ పేరేమిటి? స్కూల్‌కు వెళ్తున్నావా? వంటి ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే కొంత మంది పిల్లలు ఈ ప్రశ్నలకు మంచిగా సమాధానం చెప్తారు. కానీ మరి కొంతమంది పిల్లలు ఇంటికి అతిథులు రాగానే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అతిథులు పలకరించినా సరిగ్గా మాట్లాడరు, వారి వైపు చూసేందుకు కూడా ఇష్టపడరు. ఇంకొంత మంది పిల్లలు వచ్చిన అతిథులతో అగౌరవంగా మాట్లాడతారు. అడిగిన దానికి సమాధానం చెప్పకపోగా మీకేందుకు, నేను చెప్పను అంటూ వంకర సమాధానాలు చెప్తారు.

ఇలాంటి ప్రవర్తన అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ ప్రవర్తన కలిగిన పిల్లలను తల్లిదండ్రులు మొదటి నుంచే అదుపులో పెట్టడం ముఖ్యమని సూచిస్తున్నారు. అయితే కొంత మంది తల్లిదండ్రులు పిల్లవాడికి తెలీదులే, పెద్దయ్యాక వాడే మారతాడు అంటుంటారు. కానీ “మొక్కై వంగనిది.. మానై వంగునా” అంటారు పెద్దలు. అందుకే చిన్నప్పటి నుంచి ఇటువంటి ప్రవర్తనను కంట్రోల్ చేయకపోతే వయసు పెరిగే కొద్దీ పిల్లలు ఈ విషయంలో మొండిగా తయారవుతారట. అందుకే ఇంటికి వచ్చిన వారితో ఎలా మాట్లాడాలో చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అలవాటు చేయాలని సూచిస్తున్నారు చైల్డ్ సైకాలజిస్టులు. ముఖ్యంగా పిల్లలకు ప్రాథమిక మర్యాదలు నేర్పించడం చాలా అవసరం.

నమస్కరించడం

ఎవరైనా రాగానే చిరునవ్వుతో ‘నమస్తే’ లేదా ‘హలో’ చెప్పడం అలవాటు చేయాలి.

కూర్చోమని చెప్పడం

వచ్చిన వారికి గౌరవంగా కూర్చోవడానికి చోటు చూపించడం నేర్పాలి.

మంచినీరు ఇవ్వడం

ఇంటికి వచ్చిన వారికి మంచినీరు ఇవ్వడం మన సంస్కృతి. ఈ చిన్న బాధ్యతను పిల్లలకే అప్పగించవచ్చు.

అంతేకాకుండా అతిథులు పేరు లేదా చదువు గురించి అడిగినప్పుడు సిగ్గుపడకుండా, స్పష్టంగా సమాధానం చెప్పేలా ప్రోత్సహించాలి. పిల్లలు మంచిగా మాట్లాడినప్పుడు వారిని అభినందించడం వలన వారిలో కొంత మార్పు వస్తుందట. అయితే పిల్లల ప్రవర్తనలో మార్పు రావడానికి స్మార్ట్ ఫోన్, టీవీ వినియోగం కూడా ప్రధాన కారణమని సూచిస్తున్నారు నిపుణులు. తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు వారు ఎటువంటి వీడియోలు చూస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలట. వినోదం కోసం పిల్లలు చూసే యూట్యూబ్ వీడియోలు, కార్యక్రమాలు పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయట. వాటివల్ల కూడా పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుందని చెబుతున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>