Mobile Popup Ad
Mobile Popup Ad

అర్జీలు చూడట్లేదు.. గోడు వినట్లేదు!

కలం, నిజామాబాద్ బ్యూరో : ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి (Prajavani)లో జిల్లాస్థాయి అధికారులు ఉంటారని, తమ బాధలు చెప్పుకుంటే పట్టించుకుని వెంటనే పరిష్కారం దొరుకుతుందని ఎన్నో ఆశలతో జనాలు చూస్తుంటారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని మారుమూల తండా నుంచి మొదలుకొని టౌన్ లోని ప్రజలు ప్రణావాణి రోజు ఉదయమే కలెక్టరేట్ వస్తుంటారు. తమ సమస్యలపై సంబంధిత శాఖ అధికారులకు అర్జీలు ఇచ్చి.. హామీలు తీసుకుని వెళ్తుంటారు. కానీ అధికారులు సమస్యలకు పరిష్కారం చూపడంలేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులే పట్టించుకోకుండా ఇక తమకెవరు దిక్కంటూ వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆరు నెలలుగా ప్రజావాణికి వచ్చిన వందల అర్జీలు పెండింగ్ లోనే ఉంటున్నాయి. ఇందులో రెవెన్యూశాఖ ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి.

ఇలా చేస్తే.. తక్షణ న్యాయం

జిల్లాలో గత నెలలో ప్రజావాణి (Prajavani)కి వచ్చిన ఫిర్యాదుల్లో రెవెన్యూ డివిజన్ల వారీగా చూస్తే.. నిజామాబాద్ –54, ఆర్మూర్ –27. మండలాల వారీగా చూస్తే.. డిచ్ పల్లి –35, పోతంగల్ – 34, కోటగిరి –24, ఆర్మూర్ – 20 పెండింగ్ లో ఉన్నాయి. ప్రజావాణిలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటున్నారు. అక్కడే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల సమస్యలపై ఉన్నతాధికారులు సంబంధిత మండల అధికారులతో నేరుగా మాట్లాడి పరిష్కరించేందుకు అవకాశం ఉంది. ఈ పద్ధతిని పాటిస్తే బాధితులకు తక్షణమే న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో గత నెల అర్జీలు..

రెవెన్యూ – 402
స్థానిక సంస్థలు – 287
నిజామాబాద్ కార్పొరేషన్ – 112
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ – 61
ఆర్మూరు మున్సిపాలిటీ – 25
భీం గల్ మున్సిపాలిటీ– 22
పౌరసరఫరాలు –120

మూడు సార్లు అర్జీలు ఇచ్చా : రమేశ్ గౌడ్, దివ్యాంగుడు, మోస్రా

ఇప్పటివరకూ 3 సార్లు ప్రజావాణి కి వచ్చాను. మూడు చక్రాల పెట్రోల్ బైక్ కోసం తిరుగున్నాను. వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో వేరే వాళ్లకు వచ్చాయి. నాకు ఇవ్వలేదు. బైక్ ఇస్తే ఏదైనా పని చేసుకోవడానికి తిరగడానికి వీలుంటుంది. కోచింగ్ సెంటర్ పెట్టాలని అనుకుంటున్నాను. నిజామాబాద్ ఆఫీస్ లో ఉన్నాయి. కానీ పంపిణీ చేయడం లేదు.

పన్నెండేళ్లుగా తిరుగుతున్నా : వంజారా రెడ్డి, సయీద్ పూర్, వర్ని మండలం

1982 లో నేను 2.20 ఎకరాల భూమి కొన్నాను. అమ్మిన వ్యక్తి చనిపోతే వాళ్ళ కొడుకు నా భూమి లాక్కున్నాడు. 2014 నుంచి కలెక్టరేట్ .. కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. పరిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా నాకు రావలసిన భూమి ఇప్పించండి.

కుల బహిష్కరణ ఎత్తేయించాలి : కొండ్ర నల్లా, దీకంపల్లి, ఆలూరు మండలం

నా కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసి నాలుగేళ్లు అయింది. మా సామాజిక వర్గం వారు ఎవరూ సహకరించడం లేదు. పనులకు రానివ్వడం లేదు. మాట్లాడటం లేదు. నా వీధిలో ఉండే వాళ్ళు మా ఇంట్లోకి కూడా మమ్మల్ని రానివడం లేదు. వెళ్తే దాడి చేస్తున్నారు. మా కొడుకుకు ప్రాణ భయం ఉంది. అందుకే బయట మా బంధువుల ఇంట్లో ఉంటున్నాం. ఇప్పటికీ కలెక్టరేట్ కు 5 సార్లు వచ్చాం. పరిష్కారం కావడం లేదు. కాళ్ళు మొక్కుతా.. కుల బహిష్కరణ ఎత్తి వేయించి. మా ఇల్లు మాకు ఇప్పించండి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>