కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రీ ప్రైమరీ స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా సరికొత్త నిర్ణయం తీసుకుంది. సెమీ రెసిడెన్షియల్ విధానంలో ఆంగ్ల మాధ్యమ బోధనను అందుబాటులోకి తీసుకురానుంది. క్యూర్ వెలుపల ఉన్న 99 నియోజకవర్గాల్లో ఒక్కో ప్రాంతానికి ఒకటి చొప్పున మొత్తం 97 తెలంగాణ సెమీ పబ్లిక్ స్కూళ్లను (Telangana Public Schools) ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
అట్టడుగు వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. ప్రతి పాఠశాల నిర్మాణానికి సుమారు 10 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. అత్యాధునిక వసతులు, నిపుణులైన ఉపాధ్యాయులతో ఈ స్కూళ్లు రూపుదిద్దుకోనున్నాయి. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇవి వేదికగా నిలవనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే ఈ బృహత్తర కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయనుంది.

