కలం, సత్తుపల్లి: సింగరేణి భూసేకరణ ఆర్అండ్ఆర్ (పునరావాస, పునర్నిర్మాణ) ప్యాకేజీ వ్యవహారంలో దళారుల కుట్రలు పటాపంచలయ్యాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి (Sathupalli) మండలం కొమ్మేపల్లి గ్రామంలో మసీదు ఇమామ్‌గా పనిచేస్తున్న మహమ్మద్ ముంతాజ్ అన్సారీకి ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఫలితంగా ఆర్అండ్ఆర్ పరిహారంతోపాటు మసీదు సమీపంలోనే ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.
ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి అర్హత ఉన్నప్పటికీ, ఒక ప్రభుత్వ లెక్చరర్ దళారీగా వ్యవహరించి ఇమామ్ పేరును పక్కదారి పట్టించారని అన్సారీ తెలిపారు. అంతేకాకుండా హైకోర్టులో వేసిన కేసులో అన్సారీ పేరును అనర్హుడిగా చేర్చడంతోపాటు, గ్రామంలో ఒత్తిడి తెచ్చి ఆయనను మసీదు ఇమామ్ బాధ్యతల నుంచి కూడా తొలగించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త యాదాల శ్రీనివాస్ ఆర్టీఐ ఆధారాలతో వాస్తవాలను సేకరించి, ఆర్అండ్ఆర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్అండ్ఆర్ కమిషనర్ అనుమతితో ఆయనకు న్యాయం జరిగేలా చేశారు.
కులమతాలకతీతంగా అండగా నిలిచిన శ్రీనివాస్‌కు ముంతాజ్ అన్సారీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, కొమ్మేపల్లి ఆర్అండ్ఆర్ పరిహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2016లో అప్పటి కలెక్టర్ 258 మందిని అర్హులుగా గుర్తిస్తే, అధికారుల ఉత్తర్వులు లేకుండానే తహసీల్దార్ 29 మంది పేర్లను తొలగించారు.
కల్లూరు ఆర్డీఓ విచారణలో అనర్హులుగా తేలిన 12 మంది, రెవెన్యూ అధికారుల సాయంతో కోర్టులను ఆశ్రయించడమే కాకుండా కొమ్మేపల్లి ఆర్అండ్ఆర్ సెంటర్లోని ఖాళీ ప్లాట్లను అక్రమంగా కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దళారుల కుట్రలను దాటుకుని ఇమామ్‌కు న్యాయం జరగడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఆర్అండ్ఆర్ ప్లాట్ల ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి మిగిలిన బాధితులకు కూడా పరిహారం అందించాలని సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

