కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన వారి త్యాగాల ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నారాయణ పేట జిల్లా కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్ మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
నిజాం అంగీకరించకపోవడంతో..
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమై 78 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. అప్పటి ప్రధాని నెహ్రూ, హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని నిజాంను కోరినా అంగీకరించలేదన్నారు. దీంతో, 1948 సెప్టెంబర్ 13న భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో ప్రారంభించడంతో.. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం అవుతున్నట్లు నిజాం ప్రకటించారని వివరించారు.
రైతులకు పరిహారం..
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందజేస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 3,112 మంది రైతులకు రూ.366.95 కోట్ల పరిహారం పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన రైతులకు కూడా దశలవారీగా పరిహారం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, ట్రైనీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణి కుమార్, ఆర్డీవో రమేష్, అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేశ్, మున్సిపల్ ఛైర్పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్, వైస్ ఛైర్పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సదాశివ రెడ్డి, కలెక్టరేట్ ఏవో అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

