కలం, మెదక్ బ్యూరో: రాబోయే రెండేళ్లలో సంగారెడ్డి జిల్లా మెడికల్ కళాశాలను వైద్య విద్య, వైద్య సేవలు, మౌలిక వసతుల పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) అన్నారు. గురువారం సంగారెడ్డి మెడికల్ కళాశాల ప్రాంగణంలో హెటిరో ఫౌండేషన్ సౌజన్యంతో రూ.1.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన బాస్కెట్‌బాల్, క్రికెట్, కబడ్డీ కోర్టులు, ఓపెన్ క్రికెట్ గ్రౌండ్‌ను టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్‌లతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన వైద్య సదుపాయాలతో ఆసుపత్రుల నిర్మాణ పనులు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలు కలిగిన ఆసుపత్రుల నిర్మాణం చేపట్టి, మెరుగైన వైద్య సేవలు, ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తెలంగాణను వైద్య రంగంలో దేశంలోనే ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ అన్నారు.

