కలం, నల్లగొండ బ్యూరో : బీసీలకు 70 శాతం కార్పొరేటర్ సీట్లు కేటాయించామని, టికెట్ల కేటాయింపు విషయంలో రాష్ట్రానికే నల్లగొండ ఆదర్శంగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. ఆదివారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ అభ్యర్థులతో జూమ్ మీటింగ్‌లో మంత్రి మాట్లాడారు. 48 కార్పొరేటర్లకు అన్ని స్థానాలు గెలవాలని, మీరు గెలిస్తే.. పేద ప్రజలు గెలిచినట్టేనన్నారు. మీరు గెలిచిరండి.. అభివృద్ధిని నాకు వదిలేయండి.. సీఎం రేవంత్‌ను అడిగి ఎన్ని నిధులైనా తెస్తానని చెప్పారు.
ప్రజల దగ్గరికి ఓట్ల కోసం ఎలా వెళతామో.. వారి మంచి చెడులోనూ అంతే భాగస్వామ్యం అవ్వాలని సూచించారు. పేదవారికి కష్టమొస్తే.. నా కండ్లల్లో నీళ్లు తిరుగుతాయని, 30 ఏండ్లుగా నల్లగొండ ప్రజలకు నేనేంటో తెలుసని పేర్కొన్నారు. నల్లగొండ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని, భవిష్యత్తులో రూ.వేల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరేలా చేస్తామని వివరించారు. అధికార పార్టీ కార్పొరేటర్లు గెలిస్తే నా దగ్గరికి వచ్చి అభివృద్ధి, సంక్షేమ పనులు చేసుకోవచ్చన్నారు.
ఇటీవల పేపర్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కథనం చూసి చలించిపోయానని, వారు రావి నారాయణ రెడ్డి గ్రామస్థులు.. వారి కష్టం తెలిస్తే సాయం చేసేవాడినని చెప్పారు. ఇంటర్మీడియట్ చదివే పిల్లలతో కలసి సూసైడ్ చేసుకున్నారని తెలిసి చాలా బాధ పడ్డానని, ఎవరికన్నా బాధ వస్తె.. తట్టుకోలేను.. అట్లాంటి బాధలు నాకు తెలియాలంటే మీరు మీ డివిజన్లలో ప్రతినిధులుగా ఉండాలని కోమటిరెడ్డి (Komatireddy) పేర్కొన్నారు.
Read Also: బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Follow Us On: Sharechat


