కలం, వెబ్‌డెస్క్: నేటి యాంత్రిక జీవనంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు (Heart Attack) రావడం తీవ్ర కలకలం రేపుతోంది. చంటి పిల్లలు కూడా గుండెపోటు బాధితులవడం బాధాకరం. తాజాగా అనంతపురం (Anantapur) జిల్లాలో ఓ ఆరేళ్ల చిన్నారి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా యాకిడి మండలం చందన గ్రామంలో రామాంజనేయులు, అనిత దంపతులు నివసిస్తున్నారు. వీరికి నైనిక అనే ఆరేళ్ల కుమార్తె ఉన్నది. నైనిక ఇంటి వద్ద తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలింది. గమనించిన తల్లిదండ్రులు నైనికను రాయలచెరువు ఆస్పత్రికి తరలించారు. నైనికను పరీక్షించిన వైద్యులు అప్పటికే పాప మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇంత చిన్న వయసులో పాపకు గుండెపోటు రావడంపై అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్నారి నైనిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

