కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలోని బుజ్జి మైండ్ గేమ్ మాస్టర్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశం రాబోతోంది. హైదరాబాద్ మాదాపూర్ (Madhapur) లోని మెరిడియన్ స్కూల్ వేదికగా 59వ తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ చెస్ (Chess) టోర్నమెంట్ జరగడానికి సర్వం సిద్ధమైంది. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు మరికొద్ది గంటల్లోనే ముగియనుండటంతో.. ఆసక్తి ఉన్న ఆటగాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ టోర్నమెంట్‌లో అండర్-7 నుంచి అండర్-15 వయసు లోపు ఉన్న బాలురు, బాలికలు ఎవరైనా సరే పాల్గొనవచ్చని సూచిస్తున్నారు. ఇక ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే.. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనాలనుకునే వారు మే 23వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఎలాంటి ఎంట్రీలను అనుమతించబోమని, అలాగే నేరుగా ఆట జరిగే స్థలానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే ‘స్పాట్ ఎంట్రీ’ సదుపాయం కూడా అస్సలు ఉండదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునే వారు www.chesstelangana.com అనే వెబ్‌సైట్‌ను సందర్శించి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ ఏవైనా సందేహాలు ఉంటే.. 7337578899 లేదా 7337399299 నంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత, మే 24వ తేదీన మాదాపూర్‌లోని మెరిడియన్ స్కూల్‌లో ఈ ప్రతిష్టాత్మక చెస్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.

