కలం, నిర్మల్ : తెలంగాణ పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం విడుదల చేసిన 2026 తొలి అర్ధవార్షిక సేవా నివేదికలో నిర్మల్ (Nirmal) జిల్లా పోలీసు డాగ్ స్క్వాడ్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. హత్యలు, దొంగతనాలు, ఆలయ చోరీలు, మాదకద్రవ్యాల కేసుల ఛేదనలో ‘యామి’, ‘జెస్సీ’, ‘బోల్ట్’ శునకాలు కీలక పాత్ర పోషించినట్లు నివేదికలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డాగ్ హ్యాండ్లర్లు జి. పరమేశ్వర్, కె. శ్రీనివాస్, జి. సాయేందర్‌లకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల మంగళవారం ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా పోలీసు శునక దళం సాధించిన ఈ రాష్ట్రస్థాయి గుర్తింపు జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, జిల్లా డాగ్ స్క్వాడ్ ఇంచార్జి ఆర్‌ఐ శేఖర్, రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

