కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు సంవత్సరాల తరబడి మందకొడిగా సాగుతుండటంపై సీపీఎం (CPM) పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పనుల్లో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఎం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు రైల్వే స్టేషన్ మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం బృందం రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌లు, నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు.
దాదాపు రూ.34 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు గత మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయన్నారు. దీనివల్ల ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఖమ్మం ఎంపీ వెంటనే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. స్టేషన్లో కనీసం మంచినీటి సౌకర్యం లేకపోవడంతోపాటు ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, ఏసీ వెయిటింగ్ హాళ్ల పనులు అరకొరగానే మిగిలిపోయాయని విమర్శించారు. మూడు నెలల్లో ఆధునీకరణ పనులన్నీ పూర్తి చేయకపోతే రైల్వే స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు.

