కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం (Bhadrachalam)పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు కారులో గంజాయిని వదిలి పరారవడం కలకలం రేపింది. బుధవారం పట్టణంలోని కూనవరం రోడ్డులో రెగ్యులర్ వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు సమీపంలో ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులు దగ్గరికి వెళ్లి పరిశీలించగా షాకయ్యారు. కారులో సుమారు 33.6 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఎక్సైజ్ ఎస్ఐ శ్రీహరి రావు కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసుల తనిఖీలను దూరం నుంచి గమనించిన స్మగ్లర్లు కారును వదిలి పారిపోయినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గంజాయిని సరిహద్దు ప్రాంతాల నుంచి హైద్రాబాద్ వంటి చోట్లకు తరలిస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

