కలం, వెబ్ డెస్క్ : భారతదేశ ఎన్నికల వ్యవస్థ, ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య విధానాన్ని పునర్నించగల మూడు ప్రధాన బిల్లులను చట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో నేటి నుంచి మూడు రోజల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Session) జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, పునర్విభజన కమిషన్ బిల్లులపై కేంద్రం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టనున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 55, 81, 82, 170, 330, 332, 334 ఏ లకు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లులు రూపకల్పన చేశారు. నవీకరించిన జనాభా లెక్కల సమాచారం ఆధారంగా లోక్ సభ సీట్లు గరిష్టంగా 850 వరకు పెంచుకునేలా బిల్లు రూపొందించారు.
అలాగే, లోక్‌సభ తో పాటు రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేసే లక్ష్యంతో రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఈ సమావేశాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. 2023 లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందినప్పటికీ, అది కొత్త నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపడి ఉన్నందున ఇంకా అమలులోకి రాలేదు. 2029 లోక్ సభ ఎన్నికలకు ముందే దీనిని అమలు చేయడానికి మార్గం సుగమం చేసేందుకు నిబంధనలు సవరించేందుకు కేంద్రం బిల్లు ప్రవేశపెట్టనుంది.
మరోవైపు డీలిమిటేషన్ ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2021 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని, ఈ డేటా అందుబాటులోకి వచ్చే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని ఆయా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ లో మూడు రోజుల పాటు జరిగే సమావేశాల్లో (Parliament Session) చర్చలు వాడీవేడిగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

