కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు (Burgampadu) లో శుక్రవారం పోలీసులు భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఏపీ నుండి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న భారీ పరిమాణంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యాన్ని బూర్గంపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక మార్కెట్ యార్డు సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా ఉదంతం వెలుగుచూసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం మార్కెట్ యార్డు వద్ద నిఘా ఉంచిన పోలీసులు, అనుమానాస్పదంగా వచ్చిన ఒక లారీని ఆపి తనిఖీ చేయగా అందులో ఎలాంటి అనుమతులు లేని 28 టన్నుల పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే బియ్యం లోడుతో ఉన్న లారీని సీజ్ చేసి, అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌హెచ్ఓ మేడే ప్రసాద్ తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితులు ఈ రేషన్ బియ్యాన్ని ఎక్కడి నుంచి సేకరించారు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏయే ప్రాంతాల నుంచి ఈ బియ్యం తరలిస్తున్నారు అనే కోణంలో సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా సరిహద్దులు దాటించి బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

