కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని ఇల్లందులో పవిత్ర రంజాన్ మాసంలో ఓ వింత సంఘటన జరిగింది. ఇల్లందు పట్టణంలోని మక్బరా అబ్దుల్ ఖాదర్ శ్మశాన వాటికలో 17 ఏండ్లు గడిచినా బాలిక మృత దేహం చెక్కుచెదరకుండా ఉంది. ఈ విచిత్ర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇల్లందు పట్టణానికి చెందిన అబ్దుల్ అజమ్ ఖాన్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. అతని మృతదేహాన్ని ఖననం చేసేందుకు సమాధి తవ్వుతుండగా, మృతుడి అన్న కుమార్తె నస్రీన్ మృతదేహం బయటపడింది.
నస్రీన్ 2009లో అనారోగ్యంతో మృతి చెందింది. సుమారు 17 ఏళ్ల క్రితం చనిపోయిన మృతదేహం (Dead body) ఇప్పటికీ పాడవకుండా ఉండటం చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. మృతురాలి ఒంటిపై కప్పిన వస్త్రం కూడా మట్టిలో కలిసిపోలేదు. సాధారణంగా మృత దేహాన్ని సమాధి చేసిన మూడు నాలుగు నెలల్లో శరీరం మట్టిలో కలిసిపోతుంది. అలాంటిది 17 ఏళ్ళుగా మట్టిలో కలిసిపోకుండా ఎలా ఉందని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను మహిమగా భావించిన కుటుంబసభ్యులు ప్రార్థనలు చేయించి మళ్లీ సమాధి చేశారు.

