కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం (Bhadrachalam) పట్టణ శివారులో అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. రెండు వేర్వేరు స్కూటీల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 17.650 కిలోల ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారులో పోలీసులు నిఘా పెంచి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు స్కూటీలు అనుమానాస్పదంగా కనిపించడంతో వాటిని ఆపి తనిఖీ చేశారు. మొదటి స్కూటీని సోదా చేయగా 5.360 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. తదుపరి రెండవ స్కూటీలో ఏకంగా 12.290 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 17.650 కిలోల గంజాయితో పాటు, నిందితుల వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు.
గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు నిందితుల్లో ఒకరు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన ఉడత నవీన్ కాగా, మరొకరు యాదాద్రి భువనగిరి జిల్లా, కొండాపురం గ్రామానికి చెందిన పంజాల మణికంఠ గా పోలీసులు ధ్రువీకరించారు. ఈ సందర్భంగా అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నరు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. ఈ ముఠా ఎక్కడి నుండి గంజాయిని సేకరించింది, ఎవరికి సరఫరా చేస్తోంది అనే కోణంలో విచారణ వేగవంతం చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

