కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్‌లోని (Pakistan) ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బన్ను జిల్లాలోని ఫతా ఖేల్ సెక్యూరిటీ పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాలతో నిండిన కారుతో ఆత్మాహుతి దాడికి ఒడిగట్టారు. ఈ ఘటనలో 12 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి పోలీస్ చెక్‌పోస్ట్ భవనం పూర్తిగా నేలమట్టమైంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఘటనా స్థలంలో ఉన్న పోలీస్ వాహనం కూడా అగ్నికి ఆహుతైంది. ఈ దాడి ప్రభావంతో సమీపంలోని ఇళ్లు సైతం దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను హుటాహుటిన బన్నులోని ఎంటీఐ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి సమయంలో చెక్‌పోస్ట్ వద్ద 21 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు పోలీస్ అధికారులు ధృవీకరించారు. రక్షణ బలగాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

