కలం, నిర్మల్ : కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళకు వైద్య పరీక్షల్లో ఏకంగా 119 రాళ్లు (Bladder Stones) ఉన్నట్లు గుర్తించారు. నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలోని స్వప్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ అరుదైన ఘటన వెలుగుచూసింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన ఓ మహిళ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిని ఆశ్రయించింది. వైద్యులు డాక్టర్ శశికాంత్, డాక్టర్ అశోక్ పరీక్షలు నిర్వహించడంతో పాటు సీటీ (కేయూబీ) స్కానింగ్ చేయించారు. స్కానింగ్ నివేదికలో ఆమె మూత్రాశయంలో పెద్ద సంఖ్యలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు మూత్రాశయంలో ఉన్న 119 రాళ్లను విజయవంతంగా తొలగించారు. ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో రాళ్లను గుర్తించి శస్త్రచికిత్స ద్వారా తొలగించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

