కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో మంగళవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష పుష్పార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్య ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. అర్చకులు, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలను నిర్వహించారు.
ప్రతి ఏకాదశి పర్వదినాన స్వామివారిని పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోంది. వేకువజామున సుప్రభాత సేవతో ప్రారంభమైన నిత్యారాధనలు రాత్రి శయనోత్సవంతో ముగిశాయి. భాద్రపద మాసం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

