కలం, స్పోర్ట్స్ : ఫిఫా వరల్డ్ కప్ తర్వాత మరోసారి జైత్రయాత్ర కొనసాగిస్తుందని భావించిన మాంచెస్టర్ సిటీ(Manchester City) అభిమానులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ మిడ్‌ఫీల్డర్ రోడ్రికి (Rodri) వచ్చే వారంలో శస్త్రచికిత్స జరగనుందని కొత్త కోచ్ ఎంజో మారెస్కా అధికారికంగా వెల్లడించారు. గతంలో 2024లో ఏసీఎల్ గాయంతో ఇబ్బందులు ఎదుర్కొన్న రోడ్రి, ఆ తర్వాత కూడా పలు గాయాలతో బాధపడ్డాడు. అయినప్పటికీ స్పెయిన్ జట్టు ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బాలన్ డి ఓర్ విజేతగా నిలిచిన రోడ్రి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో మాత్రం కోచ్ స్పష్టంగా వెల్లడించలేదు. వచ్చే సోమవారం రోడ్రికి వీపు శస్త్రచికిత్స జరగనుందని, అనంతరం పూర్తి విశ్రాంతి అవసరమని మారెస్కా తెలిపారు. కోలుకున్న వెంటనే అతడు తిరిగి జట్టులో చేరతాడని ధీమా వ్యక్తం చేశారు.
రోడ్రి క్లబ్‌ను వీడనున్నాడనే ప్రచారంపై స్పందించిన మారెస్కా.. ప్రపంచ స్థాయి ఆటగాళ్ల చుట్టూ ఇలాంటి వార్తలు రావడం సహజమని అన్నారు. ప్రపంచకప్ గెలిచిన రోడ్రి వంటి ఆటగాడు ప్రతి కోచ్‌కు కావాల్సిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, దిగ్గజ కోచ్ పెప్ గ్వార్డియోలా స్థానంలో మాంచెస్టర్ సిటీ కొత్త కోచ్‌గా ఎంజో మారెస్కా బాధ్యతలు చేపట్టారు. లెస్టర్ సిటీ, చెల్సియా వంటి క్లబ్‌లలో పనిచేసిన అనుభవం ఉన్న మారెస్కా, మళ్లీ సిటీకి రావడం తనకు సొంత ఇంటికి వచ్చిన అనుభూతిని కలిగించిందని తెలిపారు. గ్వార్డియోలా హయాంలో మాంచెస్టర్ సిటీ 17 ప్రధాన ట్రోఫీలను గెలుచుకుంది. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సవాలే అయినప్పటికీ, దాన్ని గౌరవంగా స్వీకరిస్తున్నట్లు మారెస్కా చెప్పారు. మైదానంలో దూకుడైన ఆటతీరుతో విజయాలు సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

