కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ బాలుడిపై ఏకంగా 10 కుక్కలు దాడి (Stray Dogs Attack) చేసిన ఘటన బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని టీచర్స్ కాలనీలో చోటు చేసుకుంది. వేసవి సెలవుల నేపథ్యంలో సిద్దిపేటకు చెందిన అద్విక్ అనే బాలుడు తన బందువుల ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు బాలుడిపై గుంపుగా దాడి చేశాయి.
దాడిలో బాలుడి తలపై చర్మం ఊడిపోయి తీవ్రగాయాలపాలయ్యారు. వెంటనే అద్విక్ ను ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, వీధి కుక్కలతో తరచూ ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గతంలో హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడులు అనేకం జరిగాయి.

