కలం, ఖమ్మం బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే సరికొత్త ‘పామాయిల్ హబ్’గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారం గ్రామ పంచాయతీ పరిధిలోని గుత్తావారిగూడెంలో పార్టీలకు అతీతంగా నిర్వహించిన ‘పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి విచ్చేసిన మంత్రి తుమ్మలకు అక్కడి రైతాంగం సాంప్రదాయ కొమ్ము నృత్యాలు, పూలవర్షంతో ఘనస్వాగతం పలికింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును విస్తరించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. సాధారణ పంటల సాగులో రైతులు ఆరుగాలం కష్టపడినా మద్దతు ధర సమస్యలు వేధిస్తున్నాయని, అలాగే అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఎలాంటి చీడపీడల భయం, కోతుల బెడద లేకపోవడమే కాకుండా అకాల వర్షాల వల్ల నష్టపోయే ప్రమాదం లేని పామాయిల్ సాగు ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు ఒక వరంగా మారిందని కొనియాడారు.
పామాయిల్ తోటల్లో అంతర పంటలుగా కోకో, జాజికాయ, వక్క వంటి పంటలను సాగు చేయడం ద్వారా రైతులు అదనపు లాభాలను ఆర్జించవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం దమ్మపేట, అశ్వరావుపేట పరిసర ప్రాంతాల్లోని పామాయిల్ తోటలను చూస్తుంటే మలేషియా దేశాన్ని తలపించేలా కనువిందుగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. రైతుల సౌకర్యార్థం రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సాగు వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్ర ఆర్థిక ప్రగతి కూడా ముడిపడి ఉందని, పామాయిల్ సాగుతో తెలంగాణ పచ్చగా, సస్యశ్యామలంగా మారి ఇక్కడి రైతుల తలరాతలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. పూజ్యులు ఎన్టీఆర్ గారి దీవెనలతో సత్తుపల్లి ప్రజానీకం తనకు తొలిసారి రాజకీయ అవకాశం కల్పించారని గుర్తుచేసుకున్నారు. రాజకీయం అంటే తనకు కేవలం ప్రజాసేవ మాత్రమేనని, గత నలబై ఏళ్లుగా తాను ఏ నియోజకవర్గంలో ఉన్నా కేవలం అభివృద్ధే ధ్యేయంగా రాజకీయం చేశానని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, భారీ సంఖ్యలో పామాయిల్ సాగు రైతులు పాల్గొన్నారు.

