కలం, తెలంగాణ బ్యూరో : రాయదుర్గంలోని ఐదెకరాల భూ వివాదం ఊహించని మలుపు తీసుకుంటున్నది. ఎస్బీఐతో రాష్ట్ర సర్కార్ (Telangana Govt vs SBI) ఢీ అంటే ఢీ అంటున్నది. తన ఖాతాలన్నింటినీ మరో బ్యాంకులోకి బదిలీ చేయాలని ఆలోచిస్తున్నది. దానికి కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంకుకు, కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, విద్యార్థులు, రైతులు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వివిధ సెక్షన్ల ప్రజలు.. వీరందరి లావాదేవీలు ఎక్కువగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారానే జరుగుతున్నాయి.
ప్రభుత్వ ఆర్థిక సాయం ఈ ఖాతాల ద్వారానే కొనసాగుతున్నది. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ బ్రాంచీలతో విస్తృతమైన నెట్‌వర్క్ ఉన్న ఎస్బీఐ వివిధ రకాల రుణాల మంజూరులో మిగిలిన బ్యాంకులకంటే ముందు వరుసలో ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్బీఐ నుంచి మరో బ్యాంకులోకి ప్రభుత్వం షిప్ట్ కావడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది కీలకంగా మారింది. అటు ప్రభుత్వ వర్గాల్లో అయినా.. ఇటు ఉద్యోగుల్లో అయినా ఇదే అంశం చర్చనీయాంశమైంది.
ప్రభుత్వం వేలం వేసిన రాయదుర్గం భూమిలో తమకు చెందిన 5.09 ఎకరాల భూమి ఉన్నదంటూ ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించడం.. మూడు వారాల పాటు హైకోర్టు స్టే విధించడం వంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ బ్యాంకుపై ఆగ్రహంతో ఉంది. ప్రత్యామ్నాయ భూమి ఇస్తామని చెప్పినా ఎస్బీఐ వినకపోవడంతో సీరియస్గా తీసుకుంది. బద్నాం చేసే తీరులో, ప్రతిష్టను దిగజార్చే తీరులో వ్యవహరిస్తుందన్న, దీని వెనుక రాజకీయ ప్రభావం ఉండొచ్చని అనుమానిస్తున్నది. ఈ క్రమంలో తమ లావాదేవీలను ఎస్బీఐ నుంచి వేరే బ్యాంకుల్లోకి షిఫ్ట్ చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు టాక్ వినిపిస్తున్నది. అయితే.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ముద్ర ఉన్న ఎస్బీఐతో ప్రభుత్వం ఢీకొనేందుకు సిద్ధమవుతుందన్న వార్తలు హీట్ పుట్టిస్తున్నాయి.
రాష్ట్రంలోనే లీడ్ బ్యాంక్
గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు ఎక్కువ నెట్‌వర్క్ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ‘విలీనం’ నిర్ణయంతో స్టేట్ బ్యాంక్ ఇండియా ఎక్కువ బ్రాంచీలు ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుగా గుర్తింపు పొందింది. ఎస్బీహెచ్‌లో డిపాజిట్లు కూడా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో అవన్నీ ఎస్బీఐ లెక్కలోకి వచ్చేశాయి. దీంతో ఇప్పుడు ఎస్బీఐకి తెలంగాణలో దాదాపు 1200కుపైగా బ్రాంచీలు ఉన్నాయి. ఎక్కువ డిపాజిట్లు, లావాదేవీలు ఉండడంతో అది రాష్ట్రంలో లీడ్ బ్యాంకుగా మారింది. సహజంగానే రుణాల మంజూరులో కూడా ఎస్బీఐ వాటానే ఎక్కువగా ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, మహిళా సంఘాలకు ఆర్థిక సాయం, వివిధ సెక్షన్ల ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రత్యక్ష నగదు బదిలీ పథకం నిధుల జమ.. ఇలాంటివన్నీ ఎస్బీఐ ద్వారానే ఎక్కువగా జరుగుతున్నాయి. ఎస్బీఐకి ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ సర్వీసు విషయంలో మాత్రం అసంతృప్తే ఉన్నది.
గుత్తాధిపత్యానికి బ్రేక్ పడినట్లేనా?
ప్రభుత్వరంగ బ్యాంకులు అనేకం ఉన్నప్పటికీ తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎస్బీఐ ద్వారానే ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఎస్బీఐనే ఎక్కువగా వినియోగిస్తున్నది. ఇలాంటి పరిణామాలతో తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో లీడ్ బ్యాంక్‌గా అది కొనసాగుతున్నది. మరోవైపు మిగిలిన బ్యాంకులను చిన్నచూపు చూస్తూ వాటిని ఎదగనీయకుండా చేస్తున్నదని, ప్రభుత్వం ఇచ్చిన చనువుతోనే గుత్తాధిపత్యాన్ని నిర్వహిస్తున్నదనే విమర్శలూ ఎస్బీఐ విషయంలో లేకపోలేదు. మిగిలిన బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ సంస్థల డిపాజిట్లు లేకపోవడం, ఆర్థిక లావాదేవీలు జరగకపోవడంతో వాటికి గుర్తింపు తగ్గడంతోపాటు టర్నోవర్ పెంచుకోలేపోతున్నాయన్న అభిప్రాయమూ ఇతర బ్యాంకుల్లో వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎస్బీఐని దూరం పెట్టాలని భావిస్తే ఆ బ్యాంక్ ‘మోనోపలీ’కి బ్రేక్ పడినట్లేనా?.. ఇతర బ్యాంకులకు ప్రయారిటీ పెరిగినట్లేనా?.. అనే చర్చ జరుగుతున్నది.
రుణాల మంజూరులో ఇబ్బందులపై అనుమానాలు :
రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐతో తెగతెంపులు చేసుకుంటే దాని ప్రభావం ప్రజలకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై పడుతుందా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఎడ్యుకేషన్ లోన్, హౌసింగ్ లోన్, క్రాప్ లోన్, పర్సనల్ లోన్… ఇలాంటి ఎన్నో రకాల రుణాలను ఇకపైన ఎస్బీఐ కఠినం చేస్తుందేమో అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. రిజర్వు బ్యాంకు రూపొందించిన మార్గదర్శకాలు, నిబంధనల మేరకే ఏ బ్యాంకు అయినా రుణాలను ఇస్తుంది తప్ప.. ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండవనేది బ్యాంకు ఉద్యోగులు చెప్తున్న మాట. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మీద కోపంతో ప్రజలకు రుణాలను ఇచ్చే విషయంలో ఎస్బీఐ కొర్రీలు పెట్టడం లేదా రుణాలను మంజూరు చేయడానికి తగిన అర్హతలు లేవన్న సాకులతో జాప్యం చేయడం.. ఇలాంటివి జరగొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు అసౌకర్యాలు కలిగే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే అది ప్రభుత్వం మీద, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతగా మారి మరో టర్న్ తీసుకునే అవకాశాలూ లేకపోలేదు.
ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రం!
ప్రజలకు రుణాల మంజూరులో ఎస్బీఐ ఇబ్బందులు పెడితే ప్రజల్లో ఏర్పడే అసంతృప్తి, వ్యతిరేకతను ప్రతిపక్షాలు రాజకీయానికి వాడుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తప్పుపడుతున్నది. ప్రజలకు పరోక్షంగా ఇబ్బందులు తలెత్తేలా ఎస్బీఐతో ఘర్షణకు దిగుతుందనే అంశాన్ని ప్రజల్లోకి ప్రతిపక్షాలు తీసుకెళ్లే చాన్స్ ఉంది. ఎస్బీఐ వివాదాన్ని సాకుగా చూపి ప్రజలకు లోన్లు మంజూరు కాకపోవడానికి ప్రభుత్వమే కారణమంటూ ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు రెండున్నరేండ్ల టైమ్ ఉన్నప్పటికీ ఇప్పటికే నేతల హడావిడితో పొలిటిక్ హీట్ కనిపిస్తున్నది. ఇలాంటి టైమ్లో ప్రభుత్వ, ఎస్బీఐ ఘర్షణ ఎలా ముగుస్తుందన్నది కీలకం.
ఎస్బీఐ ప్రతిష్టపై నెగెటివ్!
ప్రభుత్వం తన ఖాతాలను ఇతర బ్యాంకులకు మళ్లించాలని నిర్ణయిస్తే క్యాష్ మేనేజ్‌మెంట్ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశమున్నది. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, పథకాల నిధుల చెల్లింపుల్లో ఎస్‌బీఐ కీలక భాగస్వామిగా ఉన్నందున వీటన్నింటినీ ఒకేసారి ఇతర బ్యాంకులకు బదిలీ చేయడం సాంకేతికంగా సాధ్యమే అయినా లక్షల ఖాతాల మ్యాపింగ్, డేటా మైగ్రేషన్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ వ్యవస్థల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలకు నెలల సమయం పట్టే అవకాశమున్నది. ఎస్‌బీఐపై తక్షణ ఆర్థిక ఒత్తిడి ఎంతమేర పడుతుందనే అంశం ఎలా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఖాతాలు బదిలీ చేయాలనే నిర్ణయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కానున్నది. ఇప్పటికే లీడ్ బ్యాంక్ బాధ్యత విషయంలో రిజర్వు బ్యాంకుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రిత్వశాఖకు కూడా లేఖ రాయనున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఎస్బీఐ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించే అవకాశం లేకపోలేదు.
వివాదానికి ముగింపు ఎక్కడ?
ప్రభుత్వానికి విస్తృత బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు అవసరం. బ్యాంకులకేమో ప్రభుత్వ లావాదేవీలు, పథకాల నిర్వహణ, ప్రజా రంగ వ్యాపారం అవసరం. ప్రస్తుతం రాయదుర్గం భూ వివాదంలో ఎవరు కరెక్టు.. ఎవరు కాదు.. అనే చర్చ ఎలా ఉన్నా ఇప్పుడు నెలకొన్న ఘర్షణ, విభేదాలు, పరస్పర అపనమ్మకం ఎంత తీవ్రంగా కనిపించినా చివరికి సర్దుబాటు అవుతాయనే మాటలూ వినిపిస్తున్నాయి. చర్చలు, రాజీ, న్యాయపర పరిష్కారం, పరిపాలనా ఒప్పందం.. ఇలా ఏదో ఒక రూపంలో అటు రిజర్వు బ్యాంకు లేదా ఇటు ఎస్ఎల్బీసీ.. ఇలాంటి వ్యవస్థల చొరవతో సర్దుబాటు కావచ్చనే వాదన వినిపిస్తున్నది. రిజర్వు బ్యాంకు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు రాష్ట్ర ప్రభుత్వం చేసే ఫిర్యాదు, దాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత జరిగే కసరత్తు ఆధారంగా దీనికి ముగింపు లభించనున్నది. బ్యాంకింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందా?.. భూవివాదంలో బ్యాంకు పాత్ర ఏమిటి?.. ప్రభుత్వ ఆరోపణలకు ఆధారాలేమున్నాయి?.. ఇలాంటి అంశాలను పరిశీలించిన తర్వాత రిజర్వు బ్యాంకు స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : రాంబాబు, అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు
“కేంద్ర ప్రభుత్వం ఎలాగూ ఎస్బీఐని ప్రోత్సహిస్తున్నది. చాలా రాష్ట్రాలూ ఆ బ్యాంకునే నమ్ముకున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఆధిపత్యం పెరిగిందనే అభిప్రాయం చాలా బ్యాంకుల్లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ గుర్తింపుతోనే ఆ బ్యాంకు మిగిలిన ప్రభుత్వరంగ బ్యాంకులను చిన్నచూపు చూస్తున్నది. ప్రభుత్వం ఎస్బీఐలోనే డిపాజిట్లు చేయాలని గానీ, ఆ బ్యాంకు ద్వారానే ఉద్యోగుల జీతాలు చెల్లించాలని గానీ నిబంధనల్లేవ్. ప్రభుత్వరంగ బ్యాంకు ఏదైనా ఒకటే. ఇతర బ్యాంకులకు కూడా తెలంగాణలో ఎస్బీఐకి ఉన్నంత నెట్‌వర్క్ ఉన్నది. బ్యాంకును మార్చినంతమాత్రాన ప్రజలకు ప్రభుత్వం అందించే స్కీముల్లో తేడాలు రావు. ఇప్పుడు బ్యాంకులు వినియోగిస్తున్న టెక్నాలజీతో ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు యథావిధిగానే అందుతాయి. ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరును స్వాగతిస్తున్నాం.”
తెలంగాణలో ఎస్బీఐ స్థానం (ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే) :
బ్రాంచీలు : 1200కు పైగా
ప్రయారిటీ సెక్టార్‌లో రుణాల వాటా : 18.22%
వ్యవసాయ రుణాల్లో వాటా : 22.25%
ఎంఎస్ఎంఈ రుణాల్లో వాటా : 18.91%
ఎడ్యుకేషన్ లోన్‌లో వాటా : 56.12%
హౌసింగ్ లోన్లలో వాటా : 64.75%
ఇతర అడ్వాన్సుల్లో వాటా : 21.13%
పంట రుణాల్లో వాటా : 33.40%
ఇప్పుడు ఇవ్వబోయే వానాకాలం పంట రుణాల్లో : 33.40%
వ్యవసాయ టర్మ్ లోన్స్ లో వాటా : 33.16%
ఎంఎస్ఎంఈ రుణాల్లో వాటా : 37.59%
పంట రుణాల ఖాతాల్లో వాటా : 40.70%

