కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో రూ. వేల కోట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (Bolla Brahmanaidu)కు బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు రంగారెడ్డి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పదిహేను రోజులకు ఒకసారి పీఎస్‌కు హాజరుకావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులపై బొల్లా బ్రహ్మనాయుడుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది.
కాగా, గండిపేట మండలంలో సర్వే నెం.18లోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని, రెగ్యులరైజేషన్ చేయించుకునేందుకు నకిలీ జీవోలు, రెవెన్యూ రికార్డులు సృష్టించిన కేసులో బ్రహ్మనాయుడు సహా ఆరుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న బ్రహ్మనాయుడును తమిళనాడులోని కాంచీపురంలో అదుపులోకి తీసుకున్నారు. కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో పోలీసులు బ్రహ్మనాయుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. దీంతో బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టులో ఆయన బెయిల్ కోసం పిటషన్ దాఖలు చేయగా.. తాజాగా బ్రహ్మనాయుడుకు ఊరటనిస్తూ షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

