కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక రాజకీయాలు అత్యంత కీలక మలుపులు తిరుగుతున్నాయి. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar) ఈ శనివారం లేదా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఈరోజే తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా కోరారు. అలాగే రేపు కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశం జరగనుంది.
అయితే అత్యంత కీలకమైన ఈ సమయంలో ఒక ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. సిద్ధరామయ్య రాజీనామా సమర్పించడానికి సమయం కోరగా, గవర్నర్ ఆకస్మికంగా ముంబై పయనమయ్యారు. ఆయన ఈరోజు తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఒకవేళ గవర్నర్ అందుబాటులోకి రాకపోతే, ఆయన కార్యాలయ కార్యదర్శికి రాజీనామా లేఖను అందజేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ గవర్నర్ అందుబాటులో లేకపోవడంపై కాంగ్రెస్ ముఖ్య నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బిజెపి పెద్దల ఆదేశాల మేరకే గవర్నర్ కావాలనే ముంబై వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈరోజు రాజీనామా ప్రక్రియ సజావుగా సాగితేనే తదుపరి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయి. లేదంటే గవర్నర్ వచ్చి ఆమోదించే వరకు వేచి చూడక తప్పదు. మరికొద్ది గంటల్లో కర్ణాటక రాజకీయాల్లో ఏం జరగబోతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

