కలం, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వ పాపం.. ఆక్వా రైతన్న (Aqua Farmers) పాలిట శాపంగా మారిందని వైఎస్ షర్మిల (YS Sharmila) ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభంతో రొయ్య రైతులకు అంతులేని కష్టం వచ్చిందని పేర్కొన్నారు. కంటికి రెప్పలా చూసుకొనే రొయ్య పిల్లలను బ్రతికించేందుకు ఓ బంకు దగ్గర రైతన్న పడిన ఆవేదన వర్ణనాతీతమని చెప్పారు. రూ. 500 డీజిల్ కోసం ఆ రైతు రోదించిన తీరు చూసి కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“అన్నా నాకు ఫ్యాన్ సీట్లు తిరగాలన్నా .. అప్పుచేసి రొయ్య పిల్ల వేశాను.. ఫ్యాన్ సీట్లు తిరగకపోతే నా రొయ్య పిల్ల చచ్చిపోద్ది అన్న” అంటూ రైతన్న ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. రైతన్న ఆవేదన వింటుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా? లేనట్లా? చంద్రబాబు ఛాతిలో ఉన్నది గుండెనా? బండనా? అని ప్రశ్నించారు. ఇది రైతన్నను రక్షించే ప్రభుత్వమా? భక్షించే ప్రభుత్వమా? ఇదేనా చంద్రబాబు విజినరీ? దీన్నే అంటారా అద్భుతమైన గుడ్ గవర్నెన్స్? అని అగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో కాళ్లు పట్టించుకున్న పాపం ఈ కూటమి ప్రభుత్వానికి తగలకపోదు అని పేర్కొన్నారు.
ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఏపీలోనే ఎందుకొచ్చింది? అని అటు కూటమి ప్రభుత్వాన్ని ఇటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీరి పాలనలో రాష్ట్రంలో ఫ్యూయల్ కోసం ప్రజల పడిగాపులా? పెట్రోల్ బంకుల దగ్గర మల్లయుద్ధాలా? రేషన్ విధానంలో పెట్రోల్, డీజిల్ పోయడమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపడేంత ఇంధనం ఉంటే దాదాపు 3 వేల బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఇవ్వాళ్టికి ఎందుకున్నాయి? అని ప్రశ్నించారు. ఇదేనా రాష్ట్ర ప్రజలపై కేంద్రానికున్న చిత్తశుద్ధి? ఇందుకేనా పడి పడి మోదీజీకి మద్దతు ఇచ్చేది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తొత్తుగా ఉండటానికి చంద్రబాబు సిగ్గుపడాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు.

