కళ్యాణలక్ష్మి పథకంలో నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు

కలం, నిజామాబాద్ బ్యూరో: పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ‘కళ్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ సంక్షేమ పథకాలను ఆసరాగా చేసుకుని, నకిలీ సర్టిఫికెట్లతో (Fake Certificates Racket) అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను కామారెడ్డి (Kamareddy Police) టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఈ కేసు వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్‌ఎంఓగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చందారి సంతోష్ గత నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో అధికారిక హోదాతో జారీ చేసినట్లుగా ఉన్న వయస్సు, మొదటి వివాహ ధృవీకరణ పత్రాలపై తనకు ఎలాంటి సంబంధం లేకుండా కొందరు నకిలీ సంతకాలు చేశారని ఆయన తెలిపారు. అంతేకాకుండా తన అధికారిక రబ్బరు ముద్రను స్టాంప్ ను దుర్వినియోగం చేసి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు అక్రమంగా ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఈ మోసాన్ని ఛేదించాయి. భిక్కనూర్ గ్రామానికి చెందిన తోడెంగల రాజా నరేందర్, తోడెంగల రాజలింగం “లహరి జిరాక్స్ అండ్ ఆన్‌లైన్ సెంటర్” నిర్వహిస్తూ, దరఖాస్తుదారుల నుంచి వివాహ పత్రికలు, ఆధార్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు సేకరించి ప్రతి ఫైల్‌కు రూ.4,500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేసేవారు.

ఇదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న బోయిని ప్రసాద్‌తో వీరు కుమ్మక్కై, వైద్యాధికారుల అసలు సంతకాలు తీసుకోకుండా నకిలీ సంతకాలు, రబ్బరు ముద్రలతో వయస్సు వివాహ ధృవీకరణ పత్రాలను స్వయంగా సృష్టించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పిస్తూ ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా కాజేస్తున్నట్లు తేలింది. పక్కా సమాచారంతో భిక్కనూర్‌లోని ఆన్‌లైన్ కేంద్రంపై పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులు తోడెంగల రాజా నరేందర్, తోడెంగల రాజలింగం బోయిని ప్రసాద్‌లు ముగ్గురూ కామారెడ్డి జిల్లా భిక్కనూర్ గ్రామానికి చెందినవారే.

నిందితుల వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన కంప్యూటర్ సీపీయూ ఎల్సీడీ మానిటర్, కీబోర్డ్, మౌస్, మూడు మొబైల్ ఫోన్లు, నకిలీ అధికారిక రబ్బరు ముద్రలు, స్టాంప్ ప్యాడ్, నకిలీ సంతకాలకు వాడిన పెన్నులు కంప్యూటర్‌లో భద్రపరిచిన దరఖాస్తుల డిజిటల్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారు, ప్రభుత్వానికి ఎంత ఆర్థిక నష్టం వాటిల్లింది, ఈ అక్రమాల్లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసును సాంకేతిక పరిజ్ఞానంతో చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ మధుసూదన్, టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>