కలం, నిర్మల్: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ (SC ST Commission) చైర్మన్ బక్కి వెంకటయ్య (Bakki Venkataiah) ఆదేశించారు. గురువారం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న సంక్షేమ పథకాల పురోగతి, అట్రాసిటీ కేసుల నమోదు, దర్యాప్తు, ఛార్జిషీట్ల దాఖలు, బాధితులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వివరాలు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం, కులాంతర వివాహాల ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇండ్లు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జాబ్‌కార్డుదారులకు కల్పిస్తున్న ఉపాధి వంటి అంశాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఆలస్యం లేకుండా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పారదర్శకంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేసి బాధితులకు పరిహారం సకాలంలో అందేలా చూడాలని సూచించారు. ప్రతి నెల చివరి వారంలో మండల స్థాయిలో సివిల్ రైట్స్ డే నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన అభివృద్ధి నిధులు ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడి విడుదలయ్యేలా కృషి చేస్తానని చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, కమిషన్ సభ్యులు కుస్త్రం నీలాదేవి, రాంబాబు నాయక్, ప్రవీణ్, లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, డీఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, డీఎస్పీ శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

