కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టును (Ramayapatnam Port) అంతర్జాతీయ దిగుమతులు, ఎగుమతుల కార్యకలాపాలకు అనుమతిస్తూ కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు అధికారికంగా కస్టమ్స్ పోర్టుగా నోటిఫై చేసింది. 1962 కస్టమ్స్ చట్టం కింద జారీ చేసిన ఈ నోటిఫికేషన్తో, ఈ పోర్టు ద్వారా విదేశీ సరుకుల రవాణాకు చట్టబద్ధమైన మార్గం సుగమమైంది. ఈ ముఖ్యమైన మైలురాయిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వ హయాంలో దూరదృష్టితో రూపొందించిన ‘పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ’ విధానం నేడు రాష్ట్రానికి అతిపెద్ద పెట్టుబడుల ఆకర్షణగా మారి, సత్ఫలితాలను ఇస్తోందని జగన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలోని విస్తారమైన తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక మౌలిక సదుపాయాల కేంద్రం ఉండేలా తమ ప్రభుత్వం ప్రణాళికలు రచించిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే అనే నాలుగు ప్రధాన పోర్టులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వివరించారు.
సుమారు 34 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో అభివృద్ధి చేస్తున్న రామాయపట్నం పోర్టును ప్రధాన వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడం వల్లే నేడు పరిసర ప్రాంతాల్లో భారీ పారిశ్రామిక వ్యవస్థకు పునాది పడిందని జగన్ చెప్పుకొచ్చారు. అయితే తాము వేసిన బలమైన పునాదులనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ విజయాలుగా ప్రచారం చేసుకుంటుందని విమర్శలు గుప్పించారు.

