కలం, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు డైవర్ట్ చేసే కుట్ర జరుగుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. నేడు వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం దారుణ పరిస్థితులు నెలకొన్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సాయికృష్ణ హత్య ఘటన చంద్రబాబు ఇంటి వద్దే జరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేసినా కమిషనర్ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు పాలనలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కూటమి నాయకులు సాయికృష్ణ కేసును డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
విలన్లు అనే వాళ్లు ఎక్కడో ఉండరని, చంద్రబాబు రూపంలో మన చుట్టునే ఉంటారని వ్యాఖ్యానించారు. సాయికృష్ణను చంపేసి, కనీసం అతడి తల్లికి బూడిద కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైసీపీ నేతలపై ఉండవల్లిలో జరిగిన దాడిని జగన్ ఖండించారు. అమరావతిలో భూములు ఇవ్వని రైతులను సీఎం చంద్రబాబు వేధిస్తున్నారని ఆరోపించారు. రైతులకు మద్దతుగా నిలిచేందుకు వెళ్లిన పలువురు వైసీపీ నేతలపై దాడి చేసి మళ్లీ వాళ్లపైనే కేసులు పెట్టారన్నారు. కూటమి రాకముందు రాష్ట్రంలో వైసీపీ సంక్షేమంపై చర్చ జరిగేదని, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం, లాకప్ డెత్‌లపై చర్చ నడుస్తోందని జగన్ విమర్శించారు.
ఎన్టీఆర్ బతికి ఉంటే చంద్రబాబును ప్రశ్నిస్తే ఆయనను కూడా రౌడీ షీటర్ అని ముద్ర వేసే వారన్నారు. ఉండవల్లిలో వైసీపీ నేతలపై దాడులు చేసింది, చేయించింది టీడీపీ నేతలేనని ఆరోపించారు. అమరావతిలో వేలాది ఎకరాలు తీసుకున్నారని, ఇంకా భూములెందుకని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు స్వార్థం కోసమే భూములు తీసుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిలో చేసే ప్రతి పని అవినీతితోనే జరుగుతుందన్నారు. కేంద్రం కట్టే భవనాలకు అడుగుకు రూ.4645గా నిర్ణయించారని తెలిపారు. చంద్రబాబు కట్టే సెక్రటేరియట్‌కు రూ.20 వేలకు పైగా ఇస్తున్నారని చెప్పారు. ఇది అవినీతికి నిదర్శనం కాదా అని నిలదీశారు. చంద్రబాబు ఎన్ని రకాలుగా ఇవ్వందులు పెట్టినా, కేసులు పెట్టినా కూటమి సర్కార్ అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

