కలం, వెబ్ డెస్క్: వైద్య రంగానికి చెందిన ఒక ప్రతిభావంతురాలైన యువ వైద్యురాలు అకాల మరణం చెందడం నెల్లూరు (Nellore) జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రముఖ న్యూరాలజిస్ట్, ఎనెల్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ అయిన డాక్టర్ కుంకాల లావణ్య (32) (Dr Lavanya) హఠాన్మరణం చెందారు. తగిన వైద్యం అందేలోపే ఆమె కన్ను మూశారు.
డాక్టర్ లావణ్య చెన్నైలో డీఎం అభ్యసించి అందులో గోల్డ్ మెడల్ సాధించారు. చిన్న వయసులోనే న్యూరాలజిస్ట్గా ఉన్నత స్థానానికి చేరుకున్నప్పటికీ, తక్కువ ఫీజులతో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ పేదల డాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు ఎన్నో ఉపయోగకరమైన ఉచిత వైద్య సలహాలు అందించేవారు.
అయితే, 2025 లో ఆమెకు మయాస్తినియా గ్రావిస్ అనే అత్యంత అరుదైన, ప్రాణాంతక ఆటో ఇమ్యూన్ నరాల వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీనివల్ల ఆమె కనీసం మాట్లాడలేని, నిలబడలేని స్థితికి చేరుకున్నారు. ఆ తర్వాత కీలక సర్జరీ చేయించుకుని కోలుకున్నారు. పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పినా, కేవలం నాలుగు నెలల్లోనే తిరిగి విధుల్లోకి చేరి, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాల ద్వారా సేవలు అందించారు.
మృత్యువు అంచుల్లోంచి తిరిగి వచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన లావణ్య (Dr Lavanya) ఆకస్మిక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రి డాక్టర్ దశరథ నాగేంద్ర ప్రసాద్ ఆస్పత్రి ఛైర్మన్ కాగా, భర్త పేరుపొందిన కార్డియాలజిస్ట్. ఇంట్లో ఇద్దరు పెద్ద డాక్టర్లు ఉన్పప్పటికీ, కనీసం చికిత్స అందించే సమయం కూడా ఇవ్వకుండా మృత్యువు ఆమెను కాటేసింది.
Also Read : “పబ్లిక్ లేకుండా పబ్లిక్ హియరింగ్”.. మూసీ భూసేకరణపై కేటీఆర్ ఆగ్రహం
Follow Us On : WhatsApp

