కలం, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లోని కట్నీ (Katni Fire) జిల్లా బర్హీ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీపావళి పండగ రాత్రి స్థానిక వ్యాపారి పూరన్ అగర్వాల్‌కు చెందిన నివాస సముదాయం క్రింది అంతస్తులోని షాపులో ఉన్నట్టుండి భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్నికీలలు మూడంతస్తుల భవనం మొత్తానికి వేగంగా వ్యాపించడంతో పైన నివసిస్తున్న కుటుంబ సభ్యులు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు. ఈ భయానక ప్రమాదంలో రెండు నెలల పసికందు సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో లోపలికి వెళ్లడం సాధ్యం కాక, జేసీబీ సహాయంతో భవనం వెనుక వైపు గోడను కూల్చి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. పండగ వేళ ఒకే కుటుంబంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో బర్హీ ప్రాంతంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది.

