కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున దారుణ హత్య చోటుచేసుకుంది. మిర్యాలగూడ రోడ్డు శివారులోని హ్యాపీ హోమ్స్ ఎదురుగా ఉన్న ఒక వెంచర్‌లో ఓ యువకుడిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్యచేశారు. ఈ ఘటనతో నల్లగొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృతుడిని గొల్లగూడ పెద్దబండ పరిధిలోని సత్యనారాయణ కాలనీకి చెందిన బోతు సాయిగా పోలీసులు గుర్తించారు.
దుండగులు సాయిని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి, తీవ్రమైన కక్షతో బండరాళ్లతో ముఖంపై, తలపై మోదినట్లు తెలుస్తోంది. తల పూర్తిగా చిద్రమై, మెదడు బయటకు వచ్చేలా దారుణంగా కొట్టి చంపడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే శాలిగౌరరం ఇన్‌చార్జ్ సీఐ రాఘవరావు (టూ టౌన్ సీఐ), తిప్పర్తి ఎస్ఐ శంకర్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ వేలిముద్రలు, ఇతర సాక్ష్యాలను సేకరించింది. నిందితులు పారిపోయిన మార్గాన్ని గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి క్షుణ్ణంగా పరిశీలించాయి.
“ప్రాథమిక పరిశీలన ప్రకారం ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యగానే భావిస్తున్నాం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాం. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారాలను సేకరిస్తున్నాయి. త్వరలోనే నిందితులను పట్టుకుని చట్టం ముందు నిలబెడతాం.” అని సీఐ రాఘవరావు, ఎస్ఐ శంకర్ మీడియాకు తెలిపారు. మరోవైపు సాయి హత్య వార్త తెలియగానే అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రస్తుతం ఈ కేసును తిప్పర్తి పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

