కలం, నాగార్జునసాగర్ : నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని నాయకుని తండాలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన ఓ బాలుడు కృష్ణా నదిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి. నాయకుని తండాకు చెందిన మేరావత్ బాలసైదా, సాల దంపతులకు శోభన్ (12) అనే ఒక్కగానొక్క కుమారుడు. అతడు తిమ్మాయిపాలెంలోని వరల్డ్ కిడ్స్ స్కూల్‌లో 3వ తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవులు కావడంతో సోమవారం తన ముగ్గురు స్నేహితులతో కలిసి సమీపంలోని కృష్ణా నది (Krishna River) వద్దకు ఈతకు వెళ్లాడు.
నలుగురు పిల్లలు కలిసి నీటిలోకి దిగగా, శోభన్‌కు ఈత రాకపోవడంతో ఒక్కసారిగా లోతులోకి వెళ్లిపోయాడు. తోటి పిల్లలు కేకలు వేయడంతో సమీపంలో చేపల వేటలో ఉన్న మత్స్యకారులు వెంటనే స్పందించి నదిలోకి దిగి బాలుడిని వెలికి తీశారు. అయితే అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. కంటిపాపలా చూసుకున్న ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ ఘటనతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also: భారీ శుభవార్త.. నర్సింగ్ ఆఫీసర్లకు త్వరలో నియామక పత్రాలు
Follow Us On: X(Twitter)

