కలం, నిజామాబాద్ బ్యూరో: జిల్లాలోని (Nizamabad) ఉప సర్పంచ్‌లు (Deputy Sarpanches) తమ డిమాండ్లపై గళమెత్తుతున్నారని.. గౌరవ వేతనం కల్పిస్తూ, ప్రారంభోత్సవాల శిలాఫలకాల మీద పేర్లు పెట్టాలని, స్టాండింగ్ కమిటీలలో వైస్ చైర్మన్ హెూదా ఇవ్వాలని రాష్ట్ర ఉపసర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షులు వికార్ పాషా డిమాండ్ చేశారు. మంగళవారం వికార్ పాషా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని ఉప సర్పంచులు కలెక్టరేట్ లో డీఆర్ఓ గీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలలో ప్రజాస్వామ్యం పారదర్శకత, సమిష్టి బాధ్యత అమలు కోసం పలు అధికారాలు కల్పించబడ్డాయన్నారు.
ముఖ్యంగా చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం సర్పంచ్ గైర్హాజరు అయినప్పుడు/పదవి ఖాళీ అయినప్పుడు, విధులు నిర్వహించలేని పరిస్థితులలో ఉప సర్పంచ్ కు సర్పంచ్ అధికారాలు వినియోగించుకునే హక్కు కల్పించబడినదన్నారు. ఈ విధానంతో గ్రామపంచాయతీలో అవినీతి నియంత్రణ బాధ్యతాయుత పాలన, ప్రజాధనం సరైన వినియోగం సాధ్యమవుతుందని చెప్పారు. ఉపసర్పంచ్ లు, వార్డు మెంబర్లు కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులేనని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు, పంచాయతీ పరిపాలనలో వారు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని.. అయినా ఉప సర్పంచుల సేవలకు తగిన గౌరవ వేతనం లేకపోవడం చాలా బాధాకరమన్నారు.
ఉపసర్పంచ్‌లకు రూ.5,000, వార్డు సభ్యులకు రూ.3000లను ప్రభుత్వం వేతనంగా కల్పించాలని రాష్ట్ర ఫోరమ్ తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అదే విధంగా గ్రామపంచాయతీ తీర్మానాల పత్రాల మీద ఉపసర్పంచ్‌లకు కూడా సంతకం చేసే హక్కు కల్పించాలని కోరారు. ఉపసర్పంచ్‌కు అధికారాలు, గౌరవవేతనం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షులు మహేష్, జిల్లాలోని వివిధ గ్రామాల ఉపసర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

